Bomb Threat: చెన్నై ఎంఐటీ క్యాంపస్‌కు బాంబు బెదిరింపులు.. పోలీసులు అలర్ట్
బాంబు బెదిరింపుతో తమిళనాడు రాజధాని చెన్నైలో గురువారం భయాందోళన నెలకొంది. గురువారం (సెప్టెంబర్ 12) మధ్యాహ్నం క్రోంపేటలోని అన్నా యూనివర్సిటీలోని ఎంఐటీ (మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బెదిరింపు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కార్యాలయ ఇమెయిల్ చిరునామాకు వచ్చింది. బెదిరింపులు వచ్చిన వెంటనే యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎంఐటీ క్యాంపస్‌లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.