Bomb Threat: రైల్వే స్టేషన్లకు బాంబు బెదిరింపులు.. రాజస్థాన్‌లో అధికారులు అప్రమత్తం
దేశంలో తరచూ బాంబు బెదిరింపులు అధికారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని పలు రైల్వేస్టేషన్‌లకు బుధవారం బాంబు బెదిరింపులు అందాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజస్థాన్‌లోని హనుమాన్ ఘర్ జంక్షన్‌లో స్టేషన్ సూపరింటెండెంట్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఒక లేఖ అందించాడు. ఆ లేఖ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరు మీద ఉంది. అందులో శ్రీరంగానగర్, బికనీర్, జోధ్‌పుర్, కోట, బుందీ, ఉదయర్‌పుర్, జైపుర్ తదితర రైల్వేస్టేషన్‌లలో బాంబు దాడులు జరగనున్నట్లు పేర్కొన్నారు.
జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఈ సమాచారం ఆధారంగా, బీఎస్‌ఎఫ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు వెంటనే రైల్వేస్టేషన్‌లలో తక్షణ విచారణలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీలలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. అంతేకాకుండా జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.