Vijay Mallya : భారత్‌కు రాకపోతే పిటిషన్ వినం: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు ఝలక్
ఈ వార్తాకథనం ఏంటి
లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు కఠినంగా స్పందించింది. భారత్‌కు తిరిగి రాకపోతే తనను "పారిపోయిన ఆర్థిక నేరగాడు"గా ప్రకటించిన నిర్ణయాన్ని సవాల్ చేసే పిటిషన్‌ను విచారించబోమని కోర్టు స్పష్టం చేసింది. విదేశాల్లో ఉండి ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేరని గురువారం కోర్టు తేల్చి చెప్పింది. 2016 నుంచి బ్రిటన్‌లో ఉంటూ భారత్‌కు అప్పగింపును ఎదుర్కొంటున్న మాల్యాకు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
వివరాలు
పిటిషన్‌ను కొట్టివేయకుండా మరో అవకాశం: ధర్మాసనం
పీటీఐ కథనం ప్రకారం, ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర్, న్యాయమూర్తి గౌతమ్ అంకడలతో కూడిన ధర్మాసనం, మాల్యా ముందుగా భారత్‌కు తిరిగి రావాలనే ఉద్దేశం ఉందో లేదో స్పష్టంగా చెప్పాలని ఆదేశించింది. "మీరు తిరిగి రావాలి... రావలేకపోతే ఈ పిటిషన్‌ను మేం వినలేం" అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై ఫిబ్రవరి 18న తదుపరి విచారణ జరుపుతామని తెలిపి, తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పేందుకు మాల్యాకు మరో అవకాశం ఇస్తున్నామని పేర్కొంది. "మీరు కోర్టు ప్రక్రియను తప్పించుకుంటున్నారని మేం రికార్డు చేయాల్సి రావొచ్చు. అయినా న్యాయం దృష్ట్యా పిటిషన్‌ను కొట్టివేయకుండా మరో అవకాశం ఇస్తున్నాం" అని ధర్మాసనం తెలిపింది.
వివరాలు
మాల్యా భారత్‌కు తిరిగి వస్తేనే పిటిషన్
ఇదే తరహా వైఖరిని కోర్టు గతంలోనూ తీసుకుందని గుర్తు చేస్తూ, మాల్యా భారత్‌కు తిరిగి వస్తేనే పిటిషన్‌ను వినిపిస్తామని మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయమై తన వైఖరిని తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. "మీరు ఎప్పుడు వస్తారు? కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకాకుండానే విచారణ జరగాలని మీరు వాదిస్తున్నారు. అయితే ముందుగా ఆ విషయాన్ని స్పష్టంగా అఫిడవిట్‌లో చెప్పండి" అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
వివరాలు
దేశ చట్టంపై అతనికి నమ్మకం లేకపోవడం సరైంది కాదు: మెహతా
మాల్యా తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ దేసాయ్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ భౌతికంగా కోర్టుకు రాకుండానే ఇలాంటి పిటిషన్లు విచారించి తీర్పు ఇచ్చిన న్యాయ తీర్పులు ఉన్నాయని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ పిటిషన్‌కు తీవ్రంగా వ్యతిరేకించారు. పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన తర్వాతే మాల్యా ఎఫ్‌ఈఓ చట్టంలోని నిబంధనలను సవాల్ చేశారని, ముందుగా భారత్‌కు వచ్చి చట్టాన్ని ఎదుర్కోవాలని ఆయన అన్నారు. "దేశ చట్టంపై అతనికి నమ్మకం లేకపోవడం సరైంది కాదు" అని మెహతా పేర్కొన్నారు.
వివరాలు
ఫ్యూజిటివ్ ట్యాగ్‌ను సవాల్ చేస్తున్న మాల్యా
లండన్‌లో మాల్యా వేసిన అప్పగింపు వ్యతిరేక కేసులు తుదిదశకు చేరాయని, త్వరలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని గ్రహించిన తర్వాతే ఇక్కడ ఫ్యూజిటివ్ ట్యాగ్‌ను సవాల్ చేస్తున్నాడని కేంద్రం వాదించింది. తన అఫిడవిట్‌లో బ్యాంకులు తన నుంచి డబ్బులు అడగడం తప్పని మాల్యా చెప్పిన విషయాన్ని కూడా సొలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
వివరాలు
భారత్‌లో మాల్యా ఆస్తులను జప్తు చేసిన దర్యాప్తు సంస్థలు
2016 నుంచి యూకేలో ఉంటున్న మాల్యా, తనను పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన ఉత్తర్వును సవాల్ చేస్తూ ఒక పిటిషన్, 2018లో వచ్చిన ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్స్ చట్టం రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ మరో పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. భారత్‌లో తన ఆస్తులను ఇప్పటికే దర్యాప్తు సంస్థలు జప్తు చేశాయని ఆయన న్యాయవాది తెలిపారు. 2019 జనవరిలో పీఎంఎల్‌ఏ కేసులు విచారించే ప్రత్యేక కోర్టు మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. ప్రస్తుతం 70 ఏళ్ల మాల్యా మీద మోసం, మనీలాండరింగ్‌కు సంబంధించిన పలు కేసులు భారత్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. 2016 మార్చిలో బ్యాంకు రుణాలు చెల్లించకపోవడంతో ఆయన దేశం విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే.