Hyderabad: తెలంగాణ న్యాయ వ్యవస్థకు బూస్ట్.. హైకోర్టు జోన్-2 నిర్మాణ పనులు ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థ మౌలిక వసతుల విస్తరణలో మరో కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేలులో నిర్మిస్తున్న అత్యాధునిక నూతన హైకోర్టు సముదాయంలో రెండో దశ (జోన్-II) పనులకు ఆదివారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ సూర్య కాంత్ అంకురార్పణ చేశారు. ఈ వేడుకలో రేవంత్ రెడ్డి, జస్టిస్ అపరేస్ కుమార్ సింగ్ ముఖ్య ఆకర్షణగా నిలిచారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎస్.వి.భట్టి, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ పి.ఎస్.నరసింహ కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి సహా పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
వివరాలు
అన్ని సౌకర్యాలతో నిర్మాణం
మొదటి దశలో భాగంగా హైకోర్టు ప్రధాన భవన నిర్మాణ పనులు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి. ఇక రెండో దశలో న్యాయమూర్తుల కోసం ప్రత్యేక నివాస గృహాల నిర్మాణ పనులను ప్రారంభించారు. శంకుస్థాపన అనంతరం నూతన హైకోర్టు సముదాయం మోడల్‌ను జస్టిస్ సూర్యకాంత్‌తో పాటు ఇతర అతిథులు పరిశీలించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికత, అన్ని సౌకర్యాలతో ఈ సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర కేంద్రంలో ఉన్న హైకోర్టు భవనంపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు రాజేంద్రనగర్ ప్రాంతంలో విస్తృత స్థలంలో ఈ కొత్త క్యాంపస్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది.
వివరాలు
న్యాయ వ్యవస్థ బలోపేతానికి కృషి
ఈ సముదాయం అందుబాటులోకి వస్తే న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులకు మెరుగైన సదుపాయాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు.