
Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిపై మరింత దృష్టిసారిస్తూ, స్పోర్ట్స్ సిటీ అభివృద్ధికి కీలకమైన నిర్ణయం తీసుకుంది.
ఎన్టీఆర్ జిల్లాలోని కృష్ణా నదికి సమీపంగా ఉన్న త్రిలోచనాపురం, మూలపాడు, కోటికలపూడి, జమీమాచవరం గ్రామాలను రాజధాని పరిధిలోకి చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ గ్రామాల్లో భూసేకరణ కోసం ఇటీవల గ్రామసభలు నిర్వహించగా, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి అంగీకరించారు.
పెదలంక, చినలంక దీవులను ముందుగా పరిశీలించిన ప్రభుత్వం, వరద ముప్పు ఉన్న నేపథ్యంలో వాటిని పక్కన పెట్టి పై గ్రామాలను ఎంపిక చేసింది.
మూలపాడులో ఇప్పటికే రెండు క్రికెట్ స్టేడియాలు ఉండటంతో, ఈ ప్రాంతం స్పోర్ట్స్ సిటీకి అనువుగా ఉందని అధికారులు భావిస్తున్నారు.
Details
క్రికెట్ స్టేడియం కోసం 2వేల ఎకరాల భూమి
మూలపాడు నుంచే అమరావతికి గ్రాండ్ ఎంట్రెన్స్ వే నిర్మించాలని, అలాగే కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం కూడా ప్రతిపాదితంగా ఉంది.
ఇక స్పోర్ట్స్ సిటీతోపాటు దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కూడా ప్లాన్ లో ఉంది. ఇందుకోసం 2,000 ఎకరాల భూమిని సేకరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ నిర్మాణంపై అధ్యయనం చేయడానికి మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం ఇటీవల అహ్మదాబాద్లోని స్టేడియాన్ని పరిశీలించింది.
అంతర్జాతీయ క్రీడా యూనివర్సిటీని కూడా మూలపాడులో ఏర్పాటు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు, పాల్నాడు జిల్లాలో అమరావతి అవసరాల కోసం రెండో విడత భూసేకరణను ప్రభుత్వం ప్రారంభించింది.
Details
9,617.58 ఎకరాల భూమిని సేకరించే పనిలో ప్రభుత్వం
పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకారం తెలపగా, గ్రామసభలు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి.
మొత్తంగా 9,617.58 ఎకరాల భూమిని సేకరించాలన్న ప్రభుత్వ యోజనలో భాగంగా రైతుల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించబడ్డాయి.
రైతులు ప్రభుత్వం తమకు మేలు చేసే విధంగా అభివృద్ధి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఐటీ సంస్థలు విశాఖపట్నం, పరిశ్రమలు శ్రీసిటీకే కేటాయిస్తున్నారని, అయితే అమరావతిలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే కంపెనీల వివరాలను వెల్లడించాలని కోరారు.
Details
స్పోర్ట్స్ సిటీ అభివృద్ధిపై పనులు వేగవంతం
రైతులు తమ భూముల మూల్యం ఇచ్చే ప్లాట్లను రైల్వేస్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డుకు తూర్పు వైపున ఇవ్వాలని, ఏడాదికి రూ.60 వేలు కౌలు చెల్లించి, దానిని ఏటా 10 శాతం చొప్పున పెంచాలని కోరారు.
పిల్లల చదువుల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకునేలా ప్లాట్లను తానఖా పెట్టుకునే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ఆలయ భూముల్లో కాకుండా రిజిస్టర్డ్ భూముల్లోనే ప్లాట్లు ఇవ్వాలని, రైల్వే ప్రాజెక్టులో తమ భూములు ఎక్కువగా తీసుకుంటున్నందున, రైల్వేలో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.
రైతుల వినతులపై ప్రభుత్వం ఎలా స్పందించనున్నదో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి పనులు వేగం అందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.