Page Loader
BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం 
సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం

BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2025
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీకి చెందిన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి,ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు,ఇతర ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జస్టిస్ గవాయ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. జస్టిస్ గవాయ్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.అప్పటి నుంచి అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో భాగస్వామిగా సేవలందిస్తూ చారిత్రక తీర్పులు వెలువరించారు. సీజేఐగా వారు ఆరు నెలల పాటు బాధ్యతలు నిర్వహించనున్నారు.వచ్చే నవంబరు 23న ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

వివరాలు 

ఆరేళ్లకాలంలో సుమారు 700ధర్మాసనాల్లో జస్టిస్ గవాయ్ భాగస్వామ్యం 

భారత సుప్రీంకోర్టు చరిత్రలో గవాయ్ రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా నిలిచారు. జస్టిస్ గవాయ్ 1960 నవంబరు 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. 1985 మార్చి 16న న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.నెమ్మదిగా, దశలవారీగా ఎదుగుతూ 2003 నవంబరు 14న బాంబే హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం,2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.తరువాత, ముంబయిలోని బాంబే హైకోర్టు ప్రధాన ధర్మాసనం కాకుండా,నాగ్‌పుర్,ఔరంగాబాద్,పనాజీ ధర్మాసనాల్లో కూడా ఆయన సేవలు అందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు ప్రమోషన్ పొందారు.గత ఆరేళ్లకాలంలో సుమారు 700ధర్మాసనాల్లో జస్టిస్ గవాయ్ భాగస్వామ్యం వహించారు. రాజ్యాంగ చట్టాలు,పరిపాలనా వ్యవహారాలు,పౌర,క్రిమినల్ కేసులు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్యుత్, విద్యా రంగం, పర్యావరణానికి సంబంధించిన కేసులను విచారించారు.