Fetus brain 3d images: పిండంలో మెదడు.. 3డీ హై రిజల్యూషన్ చిత్రాలతో విప్లవాత్మక పరిశోధన
మానవ మెదడు అనేక అద్భుతాలను సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన జీవజాతులకంటే మనిషిని ప్రత్యేకంగా మార్చిన కీలక భాగం. ఈ మెదడు పిండం దశలో ఎలా అభివృద్ధి చెందుతుందో ఐఐటీ మద్రాస్ (ఐఐటీఎం) తాజాగా 3డీ హై రిజల్యూషన్ చిత్రాలుగా చిత్రించారు. ఈ పరిశోధనలో ప్రపంచంలోనే మొదటిసారిగా ఇలా హై రిజల్యూషన్‌లో పిండం మెదడు చిత్రాలను రూపొందించడం జరిగినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి. కామకోటి వెల్లడించారు. ఈ అత్యాధునిక బ్రెయిన్ మ్యాపింగ్ సాంకేతికతను సుధా గోపాలకృష్ణన్ బ్రెయిన్ సెంటర్ అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు. 2022లో ఈ పరిశోధన ప్రారంభమైంది.
5,132 చిత్రాలు సేకరణ
గర్భధారణలో మెదడు అభివృద్ధి ప్రారంభమైన దశ నుంచి కాన్పు వరకు సుమారు 5,132 చిత్రాలు సేకరించి వాటిని 3డీ రూపంలో మార్చారు. ఈ పరిశోధనకు పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఖర్చు పదో వంతు మాత్రమే కావడం గమనార్హం. ఈ రీతిన చేసిన పరిశోధనలు ఆటిజం వంటి నాడీ సంబంధిత వ్యాధులను త్వరగా గుర్తించడంలో సాయపడతాయన్నారు. వీటి చికిత్సను సమర్థవంతంగా అందించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయని కామకోటి తెలిపారు. కార్యక్రమంలో జర్నల్ ఆఫ్ కంపేరిటివ్ న్యూరాలజీ ఎడిటర్ ఇన్ చీఫ్ సుజన హెక్యులనో హౌజెల్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు క్రిస్ గోపాలకృష్ణన్ పాల్గొన్నారు.