LOADING...
Arogyashree services: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌.. నేటి అర్ధరాత్రి నుంచే స్టాప్
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌.. నేటి అర్ధరాత్రి నుంచే స్టాప్

Arogyashree services: తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌.. నేటి అర్ధరాత్రి నుంచే స్టాప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పేదల ఆరోగ్యానికి సంజీవనిగా ఉన్న ఆరోగ్యశ్రీ సేవలు నిలిచే పరిస్థితి ఏర్పడింది. నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ స్పష్టం చేసిన ప్రకారం, నేటి (మంగళవారం) అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్ కింద వైద్య సేవలు నిలిపివేయనున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రాకేశ్ వెల్లడించారు. గతేడాది నుంచి ఆరోగ్యశ్రీకి 18 నెలలుగా ఈహెచ్‌ఎస్‌కు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. పెండింగ్ బిల్లుల కారణంగా ఆస్పత్రుల నిర్వహణ అసాధ్యమైపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో సేవలను కొనసాగించడం కష్టమని ఆయన స్పష్టం చేశారు.

Details

నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు విడుదల

నెట్‌వర్క్ ఆస్పత్రుల లెక్కల ప్రకారం, ప్రభుత్వ బకాయిలు సుమారు రూ.1,200 కోట్ల నుంచి రూ.1,400 కోట్ల వరకు చేరాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు సోమవారం నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు విడుదల చేసింది. అయితే ఈ మొత్తం బకాయిలతో పోలిస్తే చాలా తక్కువని, సమస్య పరిష్కారానికి ఇది సరిపోదని ఆస్పత్రుల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అందువల్ల ఇప్పటికే ప్రకటించినట్టుగానే సేవలు నిలిపివేయడమే తాము అనుసరించబోయే మార్గమని స్పష్టం చేశాయి. గత నెల 21ననే సెప్టెంబర్ 1 నుంచి సేవలు నిలిపివేస్తామని ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి లేఖ రాశాయి.

Details

ప్రభుత్వం నుంచి స్పందన లేదు

దాంతో ఆగస్టు 30న ప్రభుత్వం వారితో చర్చలు జరిపి, ఒకటి రెండు రోజుల్లో కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఆస్పత్రులు తాత్కాలికంగా తమ నిర్ణయాన్ని వాయిదా వేశాయి. కానీ 15 రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇక వెనక్కి తగ్గే పరిస్థితి లేదని ఆస్పత్రులు చెబుతున్నాయి. మరోవైపు ఆరోగ్యశ్రీ ట్రస్టు మాత్రం బకాయిల విషయంలో వేరే లెక్కలు చూపుతోంది. ప్రైవేటు ఆస్పత్రులకు రూ.530 కోట్లు, ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.550 కోట్లు కలిపి మొత్తం రూ.1,100 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని ట్రస్టు వర్గాలు పేర్కొంటున్నాయి.