Polavaram: పోలవరం పనులకు ఊపిరి.. కేంద్రం నుంచి మరో రూ.1,500 కోట్ల నిధులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం మూడో విడతగా రూ.1,508 కోట్ల అడ్వాన్స్ నిధులను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు కేటాయించగా, గత ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్‌గా ఇచ్చిన నిధులను ఈ ఏడాది మార్చి వరకు ఖర్చు చేశారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్రం రూ.3,017.40 కోట్లకు సవరించింది. ఇప్పటివరకు కేంద్రం ఇచ్చిన అడ్వాన్స్ నిధుల్లో సుమారు 80 శాతం ఖర్చు కావడంతో, మూడో విడత అడ్వాన్స్ నిధులను విడుదల చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా రూ.1,508 కోట్లను అడ్వాన్స్‌గా విడుదల చేసింది.
Details
స్పర్శ్' విధానం ద్వారా నిధులు
అయితే ఈ నిధులను మార్చి 15లోపు ఖర్చు చేస్తేనే ప్రస్తుత బడ్జెట్‌లో మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తామని కేంద్రం షరతు విధించింది. మొదటగా సింగిల్ నోడల్ ఖాతాకు కాకుండా 'స్పర్శ్' విధానం ద్వారా నిధులను విడుదల చేస్తామని కేంద్ర ఆర్థికశాఖ సూచించింది. దీనిపై రాష్ట్ర ఆర్థికశాఖతో పాటు పోలవరం ప్రాజెక్టు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, చివరికి పాత విధానమైన సింగిల్ నోడల్ ఏజన్సీ ద్వారా నిధులను విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖ ఈ నిధుల్లో నుంచి సుమారు రూ.500 కోట్లను పోలవరం ప్రాజెక్టు ఖాతాకు బదిలీ చేసింది. ఈ నిధుల్లో సుమారు రూ.500కోట్లను ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం, మరో రూ.500కోట్లను పునరావాస కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు.
Details
మూడు విడతల అడ్వాన్స్‌గా రూ.7,020 కోట్లు
గతంలో ప్రతిపాదించిన కొన్ని పనుల బిల్లులకు కోత విధించారని, ఆ బిల్లులను కూడా ఆమోదించాలని పోలవరం అధికారులు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు మొత్తం రూ.7,020 కోట్ల అడ్వాన్స్ నిధులు విడుదలయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా రూ.5,512.40 కోట్ల అడ్వాన్స్ నిధులు వచ్చాయి. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,508 కోట్ల మూడో విడత నిధులు విడుదలయ్యాయి.