BRICS: యుద్ధాలకు కాదు.. దౌత్యానికే ప్రాధాన్యం.. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో జైశంకర్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో గురువారం ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హార్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకుని సముద్ర మార్గంలో సరకు రవాణా సజావుగా సాగేందుకు ప్రపంచ దేశాలు కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని కోరింది. ముడి చమురు సరఫరా సవ్యంగా జరిగి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేలా యుద్ధ వాతావరణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అగ్ర దేశాలు విధిస్తున్న అన్యాయ ఆంక్షలను ఎదుర్కొనేందుకు బ్రిక్స్ దేశాలు ఐక్యంగా ముందుకు రావాలని భారత్ పిలుపునిచ్చింది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో తొలి రోజు విదేశాంగ మంత్రి ఎస్. ఎస్.జైశంకర్ ప్రసంగించారు.
వివరాలు
యుద్ధాలకు బదులుగా చర్చలు,దౌత్యపరమైన పరిష్కారాలకే ప్రాధాన్యం
ఇరాన్‌పై దాడులకు దిగిన అమెరికాను ఉద్దేశిస్తూ ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రతి దేశం ఇతర దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని సూచించారు. శాంతి అనేది కేవలం ఆశగా మిగిలిపోకూడదని జైశంకర్ అన్నారు. అంతర్జాతీయ చట్టాల పరిరక్షణకు శాంతి అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజల భద్రత,మౌలిక వసతుల సంరక్షణ కోసం యుద్ధాలకు బదులుగా చర్చలు,దౌత్యపరమైన పరిష్కారాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా సముద్ర మార్గంలో సరకు రవాణాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. ఇంధన సరఫరాపైనా తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. హార్మూజ్ జలసంధి తెరుచుకోవడంతో పాటు ఎర్ర సముద్ర మార్గంలో రవాణా కొనసాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాజాలో మానవతా సహాయం మరింత వేగవంతం కావాలని కోరారు.
వివరాలు
యూఏఈ, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య స్వల్ప వాగ్వాదం
శాశ్వత కాల్పుల విరమణ, మానవతా సహాయం విస్తరణ, నమ్మకమైన మధ్యవర్తిత్వం ద్వారానే శాంతి సాధ్యమని జైశంకర్ స్పష్టం చేశారు. పాలస్తీనా సమస్యకు రెండు దేశాల పరిష్కారానికే భారత్ మద్దతు ఇస్తోందని వెల్లడించారు. సమావేశంలోని ఒక చర్చా కార్యక్రమంలో యూఏఈ, ఇరాన్ విదేశాంగ మంత్రుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రులు కూడా పాల్గొన్నారు. తమ దేశంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడాన్ని యూఏఈ తీవ్రంగా వ్యతిరేకించింది.
వివరాలు
అమెరికా, ఇజ్రాయెల్‌ల చర్యలను బ్రిక్స్ దేశాలు ఖండించాలి: అబ్బాస్ అరగ్చి
ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి మాట్లాడుతూ విస్తరణవాద విధానాల వల్ల తమ దేశం నష్టపోతోందన్నారు. యుద్ధాలను ప్రోత్సహించే దేశాల చర్యలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారాయని విమర్శించారు. దాడులు కొనసాగుతున్నా ఇరాన్ ప్రజలు ధైర్యంగా నిలబడి తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు పోరాడుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌ల చర్యలను బ్రిక్స్ దేశాలు ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు.