BRS Manifesto : నేడు బీఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్.. అభ్యర్థులకు బీఫామ్ ల అందజేత
ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు బీఆర్ఎస్ రెడీగా ఉంది. ఈ మేరకు హ్యాట్రిక్ విజయమే ధ్యేయంగా ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం మధ్యాహ్నం 12. 15 నిమిషాలకు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. తొలుత ఉధయం 11గంటలకు తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. అనంతరం బీఫామ్‌లను అందజేస్తారు. తర్వాత మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థులతో కలిసి లంచ్ చేయనున్నారు. గోషామహల్, నాంపల్లి పెండింగ్‌లో ఉండగా, ఆ రెండింటి నుంచి బరిలో నిలిచే అభ్యర్థులకు నేరుగా బీఫామ్ లు అందజేయనున్నారు. అనంతరం సాయంత్రం హుస్నాబాద్ వేదికగా మొదటి ఎన్నికల ప్రచార సభను ప్రారంభించనున్నారు. అక్టోబరు 16న జనగాం, భువనగిరి నియోజకవర్గాలు, 17, 18లో సిద్దిపేట,సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో ప్రసంగించనున్నారు.
రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, యువత లక్ష్యంగా మేనిఫెస్టో
సమావేశంలో భాగంగా ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల కోడ్‌పై అభ్యర్థులకు వివరించనున్నారు. తర్వాత మీడియా సమావేశంలో తొమ్మిదిన్నర కాలంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను వివరించనున్నారు. రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, యువత, ఆసరా పెన్షనర్లకు మరింత ప్రయోజనం కలిగేలా మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేదలు, నిరుపేదలకు ఇంకా ఎక్కువ మంచి చేస్తామని ఇప్పటికే మంత్రి కేటీఆర్ చెప్పేశారు. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నామని, రైతులు, మహిళలు, రైతు కూలీలకు కొత్త స్కీమ్లున్నట్లు తెలుస్తోంది. రైతుబంధు, ఆసరా పెన్షన్ల పెంపు, సంక్షేమ పథకాలను మరింత ఎక్కువ మందికి వర్తింపజేసేలా మేనిఫెస్టో ఉండనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.