MP Danish Ali: ఎంపీ డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ.. కారణం ఇదే..
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలీని పార్టీ గతంలో చాలాసార్లు హెచ్చరించినట్లు ఆ ప్రకటనలో మిశ్రా వెల్లడించారు. 2019 నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహా లోక్‌సభ నియోజకవర్గానికి అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్‌లో అలీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నందునే బీఎస్పీ నుంచి సస్పెండ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దేవెగౌడ చెప్పడం వల్లే అలీకి టికెట్ ఇచ్చాం: బీఎస్పీ
2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ రెండూ కలిసి పోటీ చేశాయని మిశ్రా పేర్కొన్నారు. ఆ సమయంలో కర్ణాటకలో బీఎస్పీ తరఫున అలీ పని చేసినట్లు గుర్తు చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత.. దేవెగౌడ పట్టుబట్టడం వల్లే అమ్రోహా లోక్ సభ టికెట్‌ను అలీకి కేటాయించినట్లు వెల్లడించారు. బీఎస్పీ కోసం పని చేస్తారనే కారణంతోనే అమ్రోహా లోక్‌సభ స్థానం నుంచి మాయవతి పోటీకి అలీని నిలిపారని చెప్పారు. కానీ ఆయన చేసిన హామీలన్నింటినీ మరచిపోయి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయారని మిశ్రా విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా మహువా మొయిత్రాను బహిష్కరించడంపై కాంగ్రెస్ చేస్తున్న నిరననలో పార్టీ అనుమతి లేకుండా అలీ పాల్గొన్నట్లు తెలుస్తోంది.