AP Assembly: నేటి నుంచి బడ్జెట్ సెషన్..వోట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించనున్న ఆర్ధిక మంత్రి
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. అనంతరం రెండు సభలూ మంగళవారానికి వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో BAC సమావేశం జరుగుతుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. ఈ సమావేశానికి సభానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవుతారు. చివరి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలకు సమయం,కనీసం వారం రోజులైనా సభ నిర్వహించాలని టీడీపీ కోరే అవకాశం ఉంది. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది.
శాసనమండలిలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల సంతాపతీర్మానం
సాధారణంగా, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు వచ్చే ఆరు నెలల జీతాల చెల్లింపుతో సహా సాధారణ విషయాలపై డబ్బు ఖర్చు చేయడానికి అసెంబ్లీ ఆమోదం కోసం ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను సమర్పిస్తారు. శాసనమండలిలో సభ్యులు సమావేశమై ,ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల సంతాపతీర్మానాన్ని ప్రవేశ పెడతారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను బుధవారం ఉదయం 11గంటలకు శాసనసభలో ప్రవేశపెడతారు. అంతకమందు సంవత్సరం లాగే శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ సమావేశం
అయితే ఈసారి బడ్జెట్‌లో రైతులకు రుణమాఫీ,రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కొత్త ప్రకటనలు ఉండే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దానికి ముందు బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేందుకు కేబినెట్ సమావేశం కానుంది. విభజన బిల్లును ఆమోదించిన తర్వాత బుధవారంతో సమావేశాలు ముగుస్తాయి. వివిధ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించేందుకు ప్రభుత్వం సవరణలు కూడా చేపట్టే అవకాశం ఉంది.