Pager Blasts: లెబనాన్ పేజర్ పేలుళ్ల వెనుక కేరళ వ్యక్తి? దర్యాప్తులో సంచలన విషయాలు!
లెబనాన్‌లో హిజ్‌బొల్లా టార్గెట్‌గా జరిగిన పేజర్ పేలుళ్ల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్ల కారణంగా 12 మంది మృతిచెందగా, వేల మంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక భారతీయ వ్యక్తి సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. కేరళలోని వయనాడ్‌కు చెందిన 'రిన్సన్ జోష్' అనే వ్యక్తి హిజ్‌బొల్లాకు పేజర్లు సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. 37 ఏళ్ల రిన్సన్ జోష్ బల్గేరియాలో స్థాపించిన తన కంపెనీ ద్వారా హిజ్‌బొల్లాకు పేజర్లు సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రిన్సన్‌పై ప్రాథమిక విచారణ ప్రారంభం
ఈ పేజర్లను ఇజ్రాయిల్ నిఘా సంస్థ మోసాద్ సరిదిద్దినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ పేజర్లలో పేలుడు పదార్థాలు జోడించి, ఆ పేలుళ్లకు కారణమయ్యాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, బల్గేరియాలోని 'బీఏసీ కాన్సల్టింగ్ కేఎఫ్‌టీ' అనే కంపెనీకి సంబంధం ఉన్న ఆ పేజర్ల తయారీకి, ఈ పేలుళ్లకు సంబంధం లేదని బల్గేరియా భద్రతా సంస్థ డీఏఎన్ఎస్ స్పష్టం చేసింది. రిన్సన్ జోష్ ప్రస్తుతం నార్వే పౌరసత్వం కలిగి ఉన్నాడు. బల్గేరియా భద్రతా సంస్థ పేలుళ్ల గురించి దర్యాప్తు కొనసాగిస్తోంది. నార్వే రాజధాని ఓస్లో పోలీసులు రిన్సన్‌పై ప్రాథమిక విచారణ ప్రారంభించారు.
ఐదేళ్లు డిజిటల్ కస్టమర్ సపోర్ట్ విభాగంలో పనిచేసిన రిన్సన్ జోష్
రిన్సన్ జోష్, నార్వేలో తన భార్యతో ఉంటున్నట్లు అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గడచిన మూడు రోజులుగా అతను కాంటాక్ట్‌లో లేకపోవడంతో, అతన్ని టార్గెట్ చేసి, ఈ కేసులో ఇరికించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. రిన్సన్ జోష్ కొన్నేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం నార్వేకు వెళ్లాడు. లండన్‌లో కొంతకాలం పని చేసిన తరువాత, నార్వేకు తరలి వచ్చాడు. నార్వే ప్రెస్ గ్రూప్‌లో ఐదేళ్ల పాటు డిజిటల్ కస్టమర్ సపోర్ట్ విభాగంలో అతనికి పనిచేసిన అనుభవం ఉంది.