
PM Modi: మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనండి.. అస్సాం పర్యటనలో మోదీ కీలక సందేశం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఆదివారం అస్సాంలో రూ.19,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు పండుగల సీజన్‌ను స్వదేశీ వస్తువులతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కంపెనీ ఏ దేశానికి చెందినదైనా, కానీ భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అస్సాం సంతానుడు, గాయకుడు భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. నేను శివభక్తుడిని, విషం అంతా మింగేస్తా అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పటికీ భారత వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తూ, చొరబాటుదారులను రక్షిస్తుందని అన్నారు.
Details
140 కోట్ల మంది ప్రజలే నా రిమోట్ కంట్రోల్
ఈ చొరబాట్లను ఆపేందుకు బీజేపీ ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. 140 కోట్ల మంది ప్రజలే నా రిమోట్ కంట్రోల్. దాని తప్ప నాకు మరొక రిమోట్ లేదంటూ కాంగ్రెస్ అహంకారంపై ఘాటు విమర్శలు చేశారు. అస్సాం ప్రజలు కాంగ్రెస్ అవమానానికి తగిన సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. అస్సాం సాంస్కృతిక వారసత్వం గౌరవించబడాలని, రాష్ట్ర వేగవంతమైన అభివృద్ధి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల వల్ల సాధ్యమైందని ప్రధాని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, అస్సాం సంయుక్త ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రం నేడు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంటోందని అన్నారు. భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. అదే సమయంలో అస్సాం కూడా వేగంగా ఎదుగుతోంది.
Details
13శాతం వృద్ధి రేటుతో ముందుకు
ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రం, ఇప్పుడు 13% వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, ఆయన బృందానికి ప్రజల నుంచి నిరంతర మద్దతు లభిస్తోందని ప్రశంసించారు. అస్సాంను దేశ అభివృద్ధి ఇంజిన్‌గా మార్చాలన్న సంకల్పంతో బీజేపీ పని చేస్తోందని తెలిపారు. ఈ వేదిక నుంచే రూ.6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించారు. దరాంగ్ మెడికల్ కాలేజీ, హైవే-రింగ్ రోడ్ ప్రాజెక్టులను ప్రజలకు అంకితం చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కలను సాకారం చేసేందుకు దేశం మొత్తం ఐక్యంగా ముందుకు సాగుతోందన్నారు. యువతకు అభివృద్ధి చెందిన భారత్ కల మాత్రమే కాక సంకల్పమని, ఈశాన్య ప్రాంతం అందులో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
Details
ఒక దశాబద్దంలో ఆరు భారీ వంతెనలు
స్వాతంత్య్రం తర్వాత పశ్చిమ, దక్షిణ భారతదేశం మాత్రమే అభివృద్ధి చెందగా, తూర్పు భారతదేశం వెనుకబడి పోయింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ పరిస్థితులను మార్చుతోందని మోదీ అన్నారు. 21వ శతాబ్దం తర్వాతి భాగం ఈశాన్య రాష్ట్రాలదే అని ప్రకటించారు. అభివృద్ధి కోసం వేగవంతమైన కనెక్టివిటీ అవసరమని, అందుకే ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టిందని తెలిపారు. ఇది యువతకు ఉపాధి అవకాశాలు తెచ్చిందని వివరించారు. కాంగ్రెస్ 60-65 ఏళ్ల పాలనలో బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలే నిర్మించిందని, కానీ బీజేపీ ప్రభుత్వం కేవలం ఒక దశాబ్దంలో ఆరు భారీ వంతెనలు నిర్మించిందని గుర్తు చేశారు.
Details
నవరాత్రి మొదటి రోజు నుంచి జీఎస్టీ రేట్లు తగ్గింపు
మేము ఈ రోజు కోసం మాత్రమే కాదు, వచ్చే 25-50 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేశాన్ని సిద్ధం చేస్తున్నాం. 2047లో స 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మిస్తామని మోదీ అన్నారు. అదే సమయంలో ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. నవరాత్రి మొదటి రోజున జీఎస్టీ రేట్లు తగ్గబోతున్నాయి. ఆరోగ్యం, బీమా వంటి సేవలు చౌకగా అందుతాయని తెలిపారు. పండుగల సీజన్‌లో స్వదేశీ వస్తువులు మాత్రమే కొనాలని పిలుపునిచ్చారు.