బ్రిజ్ భూషణ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన దిల్లీ కోర్టు
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కు దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌లకు కోర్టు సమన్లు జారీ చేయగా మంగళవారం వారు కోర్టుకు హాజరయ్యారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు ఇద్దరికి బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అంతకుముందు దిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు ఎందుకు చేయలేదనే దానిపై వివరణ ఇచ్చారు. కేసు దర్యాప్తులో బ్రిజ్ భూషణ్ సహకరించారని అందుకే అరెస్టు చేయలేదని తెలిపారు. ఇదే విషయాన్ని పోలీసులు ఛార్జ్‌షీట్‌లోనూ పొందుపర్చారు.
అందుకే బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయలేదు: పోలీసులు
లైంగిక వేధింపుల నేపథ్యంలో మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన దిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌కు ఏడేళ్ల వరకు శిక్ష పడేలా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఏడేళ్ల వరకు శిక్షపడే కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని అరెస్టు చేయకూడదని కోర్టు తీర్పులు ఉన్నాయని దిల్లీ పోలీసులు చెప్పారు. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్‌పై దిల్లీ పోలీసులు దాదాపు 1,599 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు. ఈ చార్జిషీటులో కీలక విషయాలను వెల్లడించారు. కాల్ డేటా రికార్డుల విశ్లేషణలో నేరారోపణ ఏమీ కనిపించలేదని పోలీసులు కూడా చెప్పారు. బెదిరింపు కాల్స్ గురించి రెజ్లర్లు ఎటువంటి ఆధారాలు అందించలేదని వెల్లడించారు.