కేజ్రీవాల్ ఇళ్లు పునరుద్ధరణ ఖర్చుపై కాగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆడిట్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం పునరుద్ధరణలో ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలపై భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రత్యేక ఆడిట్ నిర్వహించనుంది. కాగ్‌తో ఆడిట్ చేయించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాసిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్య తీసుకుంది. అరవింద్ కేజ్రీవాల్ ఇంటి పునర్నిర్మాణంలో ప్రాథమికంగా ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మే 24న సెక్సేనా మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. మే 12న దిల్లీ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ను కూడా గవర్నర్ నివేదికను కోరారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) జారీ చేసిన నియమాలు, నిబంధనలు,మార్గదర్శకాల ఉల్లంఘనలు జరిగాయంటూ ప్రధాన కార్యదర్శి తన నివేదికలో వివరించారు.
ఇప్పటి వరకు 53 కోట్లు ఖర్చు: కాగ్
సీఎం అధికారిక నివాసం నిర్మాణ పనుల ప్రారంభ వ్యయం రూ. 15-20 కోట్లు అయితే, తర్వాత ఖర్చును పెంచుతూ వచ్చినట్లు కాగ్ మంగళవారం తన నివేదిలో పేర్కొంది. ఇప్పటి వరకు దాదాపు రూ. 53 కోట్ల ఖర్చు చేసినట్లు వెల్లడించింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో పునరుద్ధరణ ప్రారంభమైంది. ఇళ్లు పునర్నిర్మాణంలో భాగంగా 28 చెట్ల నరికివేత/మార్పిడి కోసం ఐదుసార్లు స్ప్లిట్ అనుమతులు తీసుకున్నారు. ఇది పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడమే అని కాగ్ పేర్కొంది. విజిలెన్స్ నివేదిక ప్రకారం కేజ్రీవాల్ నివాసంలో చేసిన నిర్దిష్ట పునరుద్ధరణ పనులలో కళాత్మక, అలంకార పనులు(రూ. 5 కోట్లు), మార్బుల్ వర్క్(రూ. 2.4 కోట్లు), మాడ్యులర్ కిచెన్(రూ. 1 కోట్లకు పైగా) ఉన్నాయి.