Canada: భారత్‌పై కెనడా మరోసారి ఆరోపణలు.. ఘాటుగా స్పందించింన కేంద్రం
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో కెనడా భారత్‌కు మరోసారి సవాలు విసిరింది. గతంలో ఈ కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటులో ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. తాజాగా కెనడా ప్రభుత్వం భారత రాయబారాన్ని అనుమానితుల జాబితాలో చేర్చడంతో మరోసారి సంచలనం రేపింది. భారత్ ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. నిజ్జర్ హత్య కేసులో కెనడా ప్రభుత్వం భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు భారత దౌత్యవేత్తలను అనుమానితులుగా గుర్తించినట్లు సమాచారం.
ఇలాంటి చర్యలు సరికాదు
ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ, ఇలాంటి చర్యలు అసలు సరికాదని స్పష్టం చేసింది. గతేడాది కెనడా పార్లమెంటులో ట్రూడో చేసిన ఆరోపణలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కెనడా నుంచి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు అందించలేదు. భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మకు 36 సంవత్సరాల దౌత్య అనుభవం ఉంది. ఆయన వివిధ దేశాల్లో భారత ప్రతినిధిగా పనిచేశారు. ఇటీవల ఆసియాన్ సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని ట్రూడో మధ్య సమావేశం జరిగినట్లు వార్తలు వచ్చినా, ఎలాంటి ప్రాముఖ్యమైన చర్చలు జరగలేదని భారత్ స్పష్టం చేసింది.