ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా స్వర్గధామమన్న భారత్.. ట్రూడో ఆరోపణలపై సాక్ష్యాలేవని నిలదీత
భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదం ముదిరింది. ఈ మేరకు కెనడా ప్రభుత్వ తీరుపై కేంద్ర విదేశాంగ శాఖ తాజాగా స్పందించింది. భారతదేశంపై కెనడా తీవ్ర ఆరోపణలపై ఆ దేశం ఇప్పటివరకు ఎటువంటి నిర్ధిష్ట సమాచారమివ్వలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ దిల్లీలో అన్నారు. ఇండియాపై కెనడా కేవలం రాజకీయ ఆరోపణలే చేసిందని బాగ్చీ తెలిపారు. దీనిపై నిజనిజాలపై విచారణ చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. అయితే కెనడా మాత్రం ఆరోపణలపై తమతో సమాచారం పంచుకోలేదన్నారు. కెనడా ఉగ్రవాదులకు నిలయమని, తమకు వ్యతిరేకంగా ఉన్నవారి వివరాలను భారత్ అందించినా, వారు మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. ఖలిస్థానీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న 20 మందికిపైగా వ్యక్తులపై చర్యలకు భారత్ పట్టుబడుతోందని బాగ్చీ చెప్పారు.