Page Loader
Btech convener Quota: 15శాతం అన్‌ రిజర్వ్డ్‌ కోటా రద్దు.. ఇకపై బీటెక్‌ సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే?
15శాతం అన్‌ రిజర్వ్డ్‌ కోటా రద్దు.. ఇకపై బీటెక్‌ సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే?

Btech convener Quota: 15శాతం అన్‌ రిజర్వ్డ్‌ కోటా రద్దు.. ఇకపై బీటెక్‌ సీట్లు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం(2025-26) నుంచి కన్వీనర్‌ కోటాలో ఉన్న బీటెక్‌ సీట్లు రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నారు. ఇప్పటివరకు కొనసాగిన 15శాతం అన్‌ రిజర్వ్డ్‌(నాన్‌ లోకల్‌)కోటాను రద్దు చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇంజినీరింగ్‌ సీట్లు 70శాతం కన్వీనర్‌ కోటా ద్వారా, 30శాతం బీ కేటగిరీ (యాజమాన్యం) కింద భర్తీ అవుతున్న సంగతి తెలిసిందే. కన్వీనర్‌ కోటాలో ఇప్పటి వరకు 85శాతం తెలంగాణ స్థానిక విద్యార్థులకు, మిగిలిన 15శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పించేవారు. రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం పూర్తయిన నేపథ్యంలో స్థానికత, స్థానికేతర కోటాలపై సమీక్ష చేపట్టేందుకు ప్రభుత్వం గతేడాది డిసెంబరులో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.

Details

తుది నిర్ణయం తర్వాత ఆదేశాలు

ఈ కమిటీ తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అందులో కన్వీనర్‌ కోటాలోని సీట్లు మొత్తం రాష్ట్ర విద్యార్థులకే కేటాయించాలని, ఇందులో 95శాతం రాష్ట్ర స్థానిక విద్యార్థులకు, మిగిలిన 5శాతం ఇతర రాష్ట్రాల్లో ఉంటూ తెలంగాణ స్థానికత కలిగినవారికి అవకాశం కల్పించాలని సూచించింది. ఈ సిఫారసులపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, తుది నిర్ణయం వెలువడిన తర్వాత అధికారిక ఆదేశాలతో ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తామని కమిటీ ఛైర్మన్‌ ఆచార్య బాలకిష్టారెడ్డి తెలిపారు.

Details

 తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం 

ప్రభుత్వం కమిటీ సిఫారసులను ఆమోదిస్తే రాష్ట్ర విద్యార్థులకు మరిన్ని ఇంజినీరింగ్‌ సీట్లు లభిస్తాయి. ప్రస్తుతం 15శాతం అన్‌ రిజర్వ్డ్‌ కోటాలో 12,000 సీట్లు ఉండగా, వాటిలో 4,000-5,000 సీట్లు మెరిట్‌ ఆధారంగా ఏపీ విద్యార్థులు పొందుతున్నారు. ఈ కోటా రద్దు చేయడం వల్ల తెలంగాణ విద్యార్థులకు మరింత అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.

Details

 విజయవాడ, కర్నూలులో ఎప్‌సెట్‌ పరీక్షా కేంద్రాలు 

జేఎన్‌టీయూహెచ్‌ గురువారం ఎప్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. నోటిఫికేషన్‌ వివరాలు మధ్యాహ్నం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని కన్వీనర్‌ ఆచార్య బి. డీన్‌కుమార్‌, కో కన్వీనర్‌ కె. విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఏపీ సరిహద్దుకు సమీపంగా ఉన్న తెలంగాణ విద్యార్థులు తమకు అనువుగా పరీక్ష రాయేందుకు విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో ఏపీలో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఉండేవి. ఈ నెల 25 నాటికి ఏపీ విద్యార్థులకు అవకాశంపై స్పష్టత రానుంది. స్పష్టత రాకపోతే ఏపీ విద్యార్థులు పరీక్ష రాయాలా? వద్దా? అనే సందిగ్ధత నెలకొనొచ్చు.