LOADING...
AP Tourism: కారవాన్‌ పర్యాటకం ప్రారంభం.. ఆంధ్రాకు సరికొత్త అనుభూతి
కారవాన్‌ పర్యాటకం ప్రారంభం.. ఆంధ్రాకు సరికొత్త అనుభూతి

AP Tourism: కారవాన్‌ పర్యాటకం ప్రారంభం.. ఆంధ్రాకు సరికొత్త అనుభూతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పర్యాటకులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు కారవాన్‌ వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ప్రారంభ దశలో వీటిని నాలుగు మార్గాల్లో నడపనున్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పోర్టల్‌ ద్వారా కారవాన్‌ వాహనాలను బుక్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ప్రభుత్వం ఎంప్యానల్‌ చేసిన రెండు ప్రైవేట్‌ సంస్థలు ప్రస్తుతం నాలుగు కారవాన్‌ వాహనాలను పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విస్తృతంగా నడుస్తున్న కారవాన్‌ పర్యాటకాన్ని ఏపీలోనూ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. దీనిపై పలు ప్రైవేట్‌ సంస్థలు ఆసక్తి చూపగా, ఓజీ డ్రీమ్‌ లైనర్స్‌, ఇండియా లక్సీ కారవాన్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థలను ఏపీటీడీసీ ఎంప్యానల్‌ చేసింది.

Details

సంక్రాంతికి ప్రత్యేక ఆరు రోజుల ప్యాకేజీ

ఈ సంస్థలు 10-12 సీట్లు, 5-6 సీట్లు కలిగిన రెండు రకాల కారవాన్‌ వాహనాలను నడపనున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌ నుంచి భీమవరం, దిండి వరకు ప్రత్యేకంగా ఆరు రోజుల కారవాన్‌ ప్యాకేజీని అందించనున్నారు. ఈ ప్యాకేజీ ధర రూ.3.50 లక్షలు. ఈనెల 10, 11, 12 తేదీలకు బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉండగా, ఆయా తేదీల నుంచి ఆరు రోజులపాటు ప్యాకేజీ అమలులో ఉంటుంది. ఈ మూడు రోజుల్లో హైదరాబాద్‌ నుంచి నాలుగు కారవాన్‌ వాహనాలను నడపనున్నారు.

Details

వసతులు, భోజన ఏర్పాట్లు

పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా మార్గమధ్యలో ఎక్కడైనా హోటళ్ల వద్ద ఆహారం కోసం వాహనాన్ని ఆపే సౌకర్యం ఉంటుంది. భోజన ఖర్చులు పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. రాత్రివేళల్లో పర్యాటక శాఖకు చెందిన హోటళ్ల ప్రాంగణాల్లో కారవాన్‌లను పార్కింగ్‌ చేస్తారు. ఆయా ప్రాంతాల్లో పర్యాటక శాఖ హోటళ్లు లేనిచోట భద్రతా దృష్ట్యా సమీప ప్రభుత్వ కార్యాలయాలు లేదా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో వాహనాలను నిలిపివేస్తారు. పగటిపూట వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించిన అనంతరం, రాత్రివేళల్లో పర్యాటకులు కారవాన్‌ వాహనాల్లోనే నిద్రపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. కూర్చునే సీట్లను నిద్రకు అనువుగా మార్చుకోవచ్చు. వాహనాల్లో టీవీ, ఫ్రిజ్‌, వాష్‌రూం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

Advertisement

Details

 ప్రారంభంలో నడిచే నాలుగు రూట్లు ఇవే

1. మార్గం: విశాఖపట్నం - అరకు - లంబసింగి (ఒకటిన్నర రోజు) ధర: రూ.42,500 (10-12 సీట్ల కారవాన్‌), రూ.31,500 (5-6 సీట్ల కారవాన్‌) 2. మార్గం: విశాఖపట్నం - సింహాచలం - అన్నవరం - పిఠాపురం - సామర్లకోట - ద్రాక్షారామం - వాడపల్లి (ఒకటిన్నర రోజు) ధర: రూ.42,500 (10-12 సీట్లు), రూ.31,500 (5-6 సీట్లు) 3. మార్గం: హైదరాబాద్‌ - గండికోట (రెండు రోజులు) ధర: రూ.85,000 (10-12 సీట్లు), రూ.64,000 (5-6 సీట్లు) 4. మార్గం: హైదరాబాద్‌ - సూర్యలంక (రెండు రోజులు) ధర: రూ.85,000 (10-12 సీట్లు), రూ.64,000 (5-6 సీట్లు)

Advertisement