Lok Sabha Elections 2024: యానిమేటెడ్ క్లిప్ వివాదం.. జేపీ నడ్డా, అమిత్ మాల్వియాపై కేసు నమోదు
మత విద్వేషాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆ పార్టీ కర్ణాటక విభాగం చీఫ్ బీవై విజయేంద్ర, ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కేసు నమోదైంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముస్లింలకు పెద్ద ఎత్తున నిధులు అందజేస్తున్నట్లు చూపుతూ కర్ణాటక బీజేపీ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన వీడియోకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. మే 4న, శనివారం నాడు బీజేపీ కర్ణాటక యూనిట్ ట్వీట్ చేసిన 17 సెకన్ల యానిమేటెడ్ వీడియోలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కాదని ముస్లింలకు ఎక్కువ నిధులు ఇస్తున్నట్లుగా సూచిస్తోంది.
నడ్డా, విజయేంద్ర, మాలవ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు
ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ లీగల్ యూనిట్ టీమ్ సభ్యుడు రమేష్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి నడ్డా, విజయేంద్ర, మాలవ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వీడియోకు సంబంధించి గతంలో కర్ణాటక కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది.