NewsClick case: అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించిన HR హెడ్
న్యూస్ క్లిక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాసిక్యూషన్‌కు అప్రూవర్ లేదా ప్రభుత్వ సాక్షిగా మారడానికి దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టును న్యూస్‌క్లిక్ హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి ఆశ్రయించారు. ప్రత్యేక జడ్జి హర్దీప్ కౌర్ ఎదుట దరఖాస్తును చక్రవర్తి సమర్పించారు. ఈ కేసులో క్షమాపణ కోరుతూ.. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్న దిల్లీ పోలీసులకు తనకు తెలిసిన సమాచారన్ని వెల్లడించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చక్రవర్తి పేర్కొన్నారు. డబ్బు కోసం చైనా అనుకూల ప్రచారం చేస్తున్నారనే ఆరోపణల చట్టం కింద చక్రవర్తి, న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్తను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అక్టోబర్ 3న అరెస్టు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద వీరిపై అభియోగాలు మోపారు.
చైనా నుంచి న్యూస్‌క్లిక్ దాదాపు రూ. 38 కోట్ల నిధులు మళ్లింపు
UAPA కేసుకు సంబంధించి న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న పలువురు జర్నలిస్టులు, ఉద్యోగుల ఇళ్లపై దాడులు నిర్వహించి అక్టోబర్ 1న దిల్లీ పోలీసులు చక్రవర్తి, ప్రబీర్ పుర్కాయస్థను అరెస్టు చేశారు. డిసెంబర్ ప్రారంభంలో పాటియాలా కోర్టు ఇద్దరు నిందితులను డిసెంబర్ 22 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. న్యూస్‌క్లిక్‌కు అందుతున్న నిధులపై ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఇదిలా ఉంటే.. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు సన్నిహితంగా ఉండే.. అమెరికన్ మిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి న్యూస్‌క్లిక్ దాదాపు రూ. 38కోట్ల నిధులను అందినట్లు ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి చైనా నుంచి భారీగా నిధులు న్యూస్‌క్లిక్‌కు అందినట్లు ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.