Ap Caste Census : గ్రామ,వార్డు సచివాలయాలకు ఆదేశాలు..వారంలోగా కులగణన సర్వే పూర్తిచేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల గణనపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కుల గణన ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈనెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుల గణనను ప్రారంభించేందుకు కసరత్తులను పూర్తి చేసింది. సర్వేను డిసెంబర్ 3 నాటికి పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలిచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద వేర్వేరు చోట్ల ఇప్పటికే సర్వే జరిగింది.ఇందులో భాగంగానే 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సర్వేలో వాలంటీర్లు,గ్రామ,వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కిపైగా అంశాలపై సమాచారం తీసుకోనున్నారు. కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్ ఫోన్లలో ప్రత్యేక యాప్'ను సైతం రూపొందించారు.
ప్రక్రియ ప్రారంభం నుంచి చివరి వరకు అదే మొబైల్ వాడాలని సూచనలు
సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబీకుల సంఖ్య, వివాహం జరిగిందా, కులం, ఉపకులం, మతం, విద్యార్హత, రేషన్ కార్డు నెంబర్, నివాస స్థల విస్తీర్ణం, ఇంటి రకం, పశువుల సంఖ్య, వ్యవసాయ భూమి విస్తీర్ణం, మరుగుదొడ్డి రకం, వంట గ్యాస్, తాగునీటి సదుపాయం తదితర అంశాలపై సమాచారం సేకరించనున్నారు. ఇదే సమయంలో సర్వే ప్రక్రియ ప్రారంభం నాటి నుంచి ముగింపు వరకు వాలంటీర్లు ఒకే మొబైల్ వినియోగించాలనే సూచనలున్నాయి. వివరాలు సేకరించే క్రమంలో పూర్తైన సందర్భంలో, స్క్రీన్ షాట్ లేదా వీడియో రికార్డింగ్ చేసేందుకు వీలు లేకుండా డిజైన్ చేశారు. వాలంటీర్లు ఇళ్ల వద్దకు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నా,ఇళ్ల వద్ద లేకపోయినా వారి వివరాలను నమోదుకు మరో వారం గడువు ఇవ్వనున్నారు.
ఈ-కేవైసీ నమోదులో గుర్తింపు కోసం ఫేషియల్, ఓటీపీ, వేలిముద్ర
ఈ మేరకు సంబంధిత కుటుంబీకులే స్థానిక సచివాలయాలకు తరవెళ్లి వారి వివరాలను చెప్పాలి. నివాసం ఎక్కడ ఉంటున్నారో దాన్నే శాశ్వత చిరునామాగా పరిగణిస్తారు. కుటుంబంలో ఎవరైనా చనిపోతే అదే కుటుంబంలోని మరొకరు దాన్ని ధ్రువీకరిస్తూ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. శ్రీకాకుళం, డా.అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పొట్టిశ్రీరాములు నెల్లూరు, కడప జిల్లాల్లో ఎంపిక చేసిన ఒక్కో సచివాలయంలో జరుగుతున్న 'కులగణన పైలెట్ సర్వే'పై గ్రామ, వార్డు సచివాలయ శాఖ అడిషనల్ డైరెక్టర్ ధ్యానచంద్ర అధికారులకు సలహాలు, సూచనలు అందించారు. ఈ క్రమంలోనే బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రాథమికంగా ఎదురైన సమస్యలపై, వాటి పరిష్కారంపై చర్చించారు. ఈ-కేవైసీ నమోదులో గుర్తింపు కోసం ఫేషియల్, ఓటీపీ, వేలిముద్ర, తదితర సౌకర్యాలు కల్పించామన్నారు.