Caste Census: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి కుల గణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే
రాష్ట్రంలోని అన్ని కులాలను లెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి సమగ్ర కుల గణనను ప్రారంభించనుంది. ఏపీలో 6 జిల్లాల పరిధిలోని 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింది కులగణన ఇప్పటికే విజయవంతంగా నిర్వహించారు. నేటి నుండి ప్రారంభం కానున్నఈ కులగణన ప్రక్రియ ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్‌లో కులగణన వివరాలు వివరాలు సేకరించాలి,ఒక వేళ మారుమూల పల్లెల్లో గాని,సిగ్నల్ లేని ప్రాంతాల్లో గాని అయితే ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలని నిర్ణయించారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది,ఎన్యుమరేటర్లు కులగణన కోసం ఈ రోజు నుండి జనవరి 28 మధ్య ఇంటింటికీ వెళతారు.
ప్రత్యేక యాప్‌లో సర్వే వివరాలు
జనాభా గణన సమయంలో ఇళ్లలో అందుబాటులో లేనివారు,ఇంటింటి ప్రక్రియలో పాల్గొనలేని వారు, తమ కుల సమాచారాన్ని గ్రామ,వార్డు సచివాలయాలలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 2, 2024 వరకు నమోదు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో సర్వే వివరాలు నమోదు చేస్తారు.. ఒకవేళ గణన సమయంలో ఏదైనా తప్పు తలెత్తే సమస్యల సత్వర పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల వద్ద సహాయ కేంద్రాల ఏర్పాటు చేస్తారు. ఫిబ్రవరి 15 నాటికి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో తుది కుల గణన నివేదికను సిద్ధం చేస్తారు.
కులాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు సేకరించిన ప్రభుత్వం
స్వాతంత్య్రానంతరం భారతదేశంలో కుల గణన జరగలేదని, కేవలం జనాభా గణన మాత్రమే జరుగుతుందని సమాచార, పౌరసంబంధాల (I & PR) మంత్రి సి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అంతకుముందు అన్నారు. కుల గణనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులాల ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కుల గణనను నిష్పక్షపాతంగా, సమగ్రంగా నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ తన గణన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా రోల్ మోడల్‌గా ప్రదర్శించాలనుకుంటోంది. జనాభా గణనలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కోసం గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు స్వచ్ఛంద వ్యవస్థను విస్తృతంగా అమలు చేస్తోంది.