AP Caste Census: ఫిబ్రవరి 15 నాటికి ఆంధ్రప్రదేశ్ కుల గణన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల గణనను ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కుల గణనతో పాటు,సామాజిక-ఆర్థిక డేటా,ఉపాధి,విద్య సమాచారం కూడా లెక్కిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ కులాలు,ఉపకులాల గణన పూర్తి చేయడం ద్వారా సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నవంబర్ 2021లో,ఆంధ్రప్రదేశ్ 2021 జనాభా లెక్కలతో పాటు కుల గణనను నిర్వహించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.అయితే అది ఆ సమయంలో కార్యరూపం దాల్చలేదు. కుల ప్రాతిపదికన సమగ్ర జనాభా గణనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నవంబర్ 3న ఆమోదం తెలిపింది.
ఫిబ్రవరి 15 నాటికి సమగ్ర సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచన
ఈ మేరకు కులాల వారీగా సర్వే నిర్వహణకు షెడ్యూల్ ను ప్రకటిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ జనవరి 9వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 15 నాటికి సమగ్ర సర్వేను ప్రభుత్వం ఎలా చెయ్యనుందంటే: గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది,ఎన్యుమరేటర్లు జనవరి 19 -28 మధ్య ఇంటింటికీ వెళతారు. జనాభా గణన సమయంలో ఇళ్లలో అందుబాటులో లేనివారు,ఇంటింటి ప్రక్రియలో పాల్గొనలేని వారు, తమ కుల సమాచారాన్ని గ్రామ,వార్డు సచివాలయాలలో జనవరి 29 నుండి ఫిబ్రవరి 2, 2024 వరకు నమోదు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 నాటికి గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో తుది కుల గణన నివేదికను సిద్ధం చేస్తారు.
వైఎస్‌ఆర్‌సీపీ గత కొంతకాలంగా జనగణనపై హామీ
సచివాలయ సిబ్బంది,ఎన్యుమరేటర్లకు గురువారంతో శిక్షణ పూర్తయింది. ఈరోజు ఎన్యుమరేటర్లు, సిబ్బంది, సూపర్‌వైజర్ల మ్యాపింగ్‌ను ఖరారు చేస్తారు. జనాభా గణన సామాజిక-ఆర్థిక, విద్య, ఉపాధి అంశాలపై వివరాలను సేకరిస్తుంది. కుల గణన డేటా కోసం దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్న భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ గత కొంతకాలంగా జనగణనపై హామీ ఇస్తోంది.