Page Loader
తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ
నకిలీ డాక్టర్లపై సీబీఐ ఫోకస్

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్.. రంగంలోకి సీబీఐ

వ్రాసిన వారు Stalin
Dec 30, 2022
02:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ డాక్టర్ల స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో వైద్య విద్య చదివి.. అర్హత పరీక్ష రాయకుండానే.. ప్రాక్టీసు చేస్తున్న వైద్యులపై సీబీఐ గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తోపాటు మిగతా రాష్ట్రాల్లో 91చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో దేశవ్యప్తంగా 73మంది అర్హత లేని వైద్యులు ప్రాక్టీసు చేస్తున్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు ఉన్నారు. నకిలీ ఎఫ్‌ఎంజీఈ సర్టికెట్లతో ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లలో ఈ 73మంది రిజిస్టర్ చేయించుకున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 14రాష్ట్రాల మెడికల్ కౌన్సిళ్లపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

సీబీఐ

ఎఫ్‌ఎంజీఈ ఉత్తీర్ణత సాధించకుండానే రిజిస్ట్రషన్..

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి తిరిగి వచ్చినవారు తప్పనిసరిగా ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌ (ఎఫ్‌ఎంజీఈ) పరీక్షలు ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఈ) నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణణ సాధిస్తేనే.. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ కానీ.. రాష్ట్రాల మెడికల్‌ కౌన్సిళ్లు కానీ.. రిజిస్ట్రేషన్‌ నెంబర్లు ఇస్తాయి. ఎఫ్‌ఎంజీఈలో ఉత్తీర్ణత సాధించని కొందరు.. నకిలీ పత్రాలను సృష్టించిన రాష్ట్రాల మెడికల్‌ కౌన్సిళ్లలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నట్లు సీబీఐ దృష్టికి రావడంతో ఈ ఆపరేషన్ నిర్వహించింది. దీంతో స్కామ్ బయటపడింది. తెలుగు రాష్ట్రాలో గుర్తించిన ఆరుగురు నకిలీ వైద్యుల్లో రాకేష్‌కుమార్(కాజీపేట), శ్రీనివాసరావు(చేవెళ్ల), మహ్మద్ ఫసియుద్దీన్(వరంగల్‌), హరికృష్ణారెడ్డి(లింగంపల్లి), మరుపిళ్ల శరత్‌బాబు(విజయవాడ), రాజవంశీ(విశాఖపట్నం) ఉన్నారు.