MUDA Scam: సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోంది.. రాష్ట్ర కేసుల దర్యాప్తును ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం
ముడా (మైసూరు నగరాభివృద్ధి సంస్థ) స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల విచారణ కోసం సీబీఐకి అనుమతి ఉపసంహరించాలని నిర్ణయించింది. ఈ కుంభకోణం చుట్టూ వాస్తవాలు వెలుగులోకి రాలన్న డిమాండ్ల మధ్య ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
గవర్నర్ అడిగిన ఎలాంటి సమాచారం అందించకూడదు.. కర్ణాటక కేబినెట్ ఆదేశాలు
"రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిని ఉపసంహరించుకుంటున్నాం.వారు తమ అధికారాలను దుర్వినియోగం చేయవచ్చని మాకు ఆందోళన ఉంది.వారిది పక్షపాత వైఖరి,దీనికి ముడా స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదు. మేము సీబీఐకి నియమించిన అన్ని కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయలేదు, ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మేము సీబీఐకి సూచించిన కేసులను వారు తిరస్కరించిన అనేక సందర్భాలు ఉన్నాయి. సీబీఐ తప్పుడు మార్గంలో పడకుండా నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాతో అన్నారు. ఇంకా, తన అనుమతి లేకుండా గవర్నర్ అడిగిన ఎలాంటి సమాచారం అందించకూడదని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి కర్ణాటక కేబినెట్ ఆదేశాలు ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీని దుర్వినియోగం చేసిందనే విమర్శలు
అనుమతి నిరాకరించిన రాష్ట్రాలు చాలానే ఉన్నాయి, అయితే అవన్నీ విపక్ష పార్టీల పాలనలో ఉన్నాయి. ఈ రీతిలో అనుమతిని నిరాకరించిన రాష్ట్రాలలో ఏదైనా కేసును సీబీఐ విచారించాల్సి వస్తే, దానికి సంబంధించి సదరు ప్రభుత్వం రాతపూర్వక అనుమతి అవసరం. బెంగాల్‌లో ఆర్జీ కర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనలో సీబీఐ దర్యాప్తు కూడా ఆ కోవలోనే ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా కర్ణాటక మాదిరిగా అనుమతి ఉపసంహరించుకుంది. తమిళనాడు (డీఎంకే), కేరళ (వామపక్షకూటమి) వంటి రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీని దుర్వినియోగం చేసిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశం
ఇంకా, ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందటం, ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల మేరకు ఆగస్టు 16న సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా,దానిని గవర్నర్ తోసిపుచ్చారు.తద్వారా, సీఎం హైకోర్టును ఆశ్రయించినా ఫలితం రాలేదు. ఈ భూకుంభకోణం సమగ్ర దర్యాప్తులో భాగంగా సిద్ధూను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం చట్టబద్ధమేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అలాగే,కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఈ పరిస్థితుల్లో సిద్దరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తున్న సమయంలో తాజా నిర్ణయం వెలువడింది.