వైఎస్ వివేకా రాసిన లేఖపై వేలి ముద్రలు ఎవరివో తేల్చే పనిలో సీబీఐ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సీబీఐ కీలక కసరత్తును చేపట్టింది. వివేకానంద రెడ్డి రాసిన లెటర్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఆ లేఖపై ఎవరి వేలి ముద్రలు ఉన్నాయనే తేల్చే పనిలో సీబీఐ నిమగ్నమైంది. ఆ వేలి ముద్రలను గుర్తించేందుకు నిన్ హైడ్రెట్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు, నిందితుల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు జూన్ 2వ తేదీన విచారించనుంది.
అనుమానితుల వేలిముద్రలతో సరిపోల్చాలని సీబీఐ అధికారుల నిర్ణయం
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన స్థలంలో సీబీఐ అధికారులకు ఒక లేఖ దొరికింది. ఈ లేఖను పరిశీలన కోసం సీబీఐ అధికారులు ఫిబ్రవరి 11, 2022న ఫోరెన్సిక్ బృందానికి పంపారు. ఈ క్రమంలో ఈ లేఖను పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు వివేక ఒత్తిడిలోనే రాసినట్లు తేల్చారు. అయితే వివేక రాసిన లేఖపై ఎవరి వేలి ముద్రలు ఉన్నాయనే దానిపై నిగ్గు తేల్చే పనిలో సీబీఐ అధికారులు నిమగ్నయ్యారు. అంతేకాకుండా లేఖపై ఉన్న వేలి ముద్రలను అనుమానితుల వేలిముద్రలను సరిపోల్చాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ లేఖ కీలకంగా మారే అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు.