మనీష్ సిసోడియా అరెస్టును సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారు: కేజ్రీవాల్
దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆప్ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిసోడియా అరెస్ట్ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే జరిగిందని చెప్పారు. చాలా మంది సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. వారందరికీ సిసోడియా పట్ల అపారమైన గౌరవం ఉందని చెప్పారు. సిసోడియాను అరెస్టు చేయడానికి అతడిని వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. సిసోడియాను అరెస్టు చేయాలని రాజకీయ ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ వెల్లడించారు.
ఆమ్ ఆద్మీ పార్టీని అణగదొక్కాలని చూస్తున్న బీజేపీ: సౌరభ్ భరద్వాజ్
ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ కూడా సిసోడియా అరెస్టుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీబీఐ అధికారుల నుంచి వచ్చిన విశ్వసనీయమైన సమాచారం మేరకే, కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ అణగదొక్కాలని చూస్తోందన్నారు. ఇది ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి అన్నారు. ప్రధాని మోదీ శాశ్వంత కాదని సీబీఐలో ఉన్న కొందరు ఆలోచనా పరులకు తెలుసునని చెప్పారు. ఇదిలా ఉంటే, సిసోడియాను సోమవారం దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. విచారణ నిమిత్తం సిసోడియాను ఐదు రోజుల రిమాండ్ కోసం అనుమతివ్వాలని సీబీఐ కోర్టును కోరింది. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులను కోర్టు రిజర్వ్ చేసింది.