Chandranath Rath Murder: సీఎం సువేందు పీఏ హత్య.. యూపీఐ చెల్లింపుతో బయటపడిన మిస్టరీ.. ముగ్గురు అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీఎం సువేందు అధికారికి సహాయకుడిగా పనిచేసిన చంద్రనాథ్ రథ్ హత్య సాధారణ ఘటన కాదని, పక్కా ప్రణాళికతో అమలు చేసిన సుపారీ హత్యగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అనుమానిస్తోంది. ఈఘటన కోసం రూ. కోటికి పైగా ఖర్చు చేసినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈహత్యలో అంతర్రాష్ట్ర నేర ముఠాల ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలుతోంది. నకిలీ నంబర్ పలకలతో వాహనాలు ఉపయోగించడంతో పాటు అత్యాధునిక తుపాకులను వినియోగించినట్టు గుర్తించారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం నార్త్ 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో హత్య జరిగిన ప్రదేశాన్ని మరోసారి పరిశీలించింది.
వివరాలు
హత్యకు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా
ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి సీబీఐ డీఐజీ పంకజ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని బృందం ఘటన జరిగిన తీరును పూర్తిగా అధ్యయనం చేసింది. మే 6న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకే చంద్రనాథ్ రథ్‌పై దుండగులు దాడి చేశారు. ఆయన ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ వాహనంలోనే కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ మొత్తం ఆపరేషన్ కోసం భారీగా డబ్బు ఖర్చు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయుధాల కొనుగోలు, నిఘా ఏర్పాటు,వాహనాల వినియోగం,కిరాయి హంతకుల నియామకం కోసం పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించినట్టు భావిస్తున్నారు. ఉపయోగించిన తుపాకుల్లో ఒకటి అక్రమ మార్కెట్లో రూ.10 లక్షలకు పైగా విలువ ఉంటుందని సమాచారం.
వివరాలు
యూపీఐ చెల్లింపుతో చిక్కిన వైనం
ఈ స్థాయిలో డబ్బు సమకూర్చిన వ్యక్తులు ఎవరు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. హత్య అనంతరం నిందితులు నకిలీ నంబర్ పలకలతో ఉన్న వాహనాల్లో పరారయ్యారు. అయితే హౌరా జిల్లాలోని ఓ టోల్ ప్లాజా వద్ద చేసిన యూపీఐ చెల్లింపు దర్యాప్తుకు కీలక ఆధారంగా మారింది. ఆ చెల్లింపు వివరాల ఆధారంగా నిందితుల జాడను గుర్తించిన అధికారులు ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో మయాంక్ రాజ్ మిశ్రా, విక్కీ మౌర్య, రాజ్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్న సీబీఐ, ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? హత్యకు దారితీసిన కారణాలేమిటి? అనే కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తోంది.