
CBI: ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్‌ను అమెరికాలో సీబీఐ అదుపులోకి తీసుకుంది..
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 26 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్‌ను అమెరికాలో అధికారులు పట్టుకుని, భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కస్టడీకి అప్పగించినట్టు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి ఆమెను ఎయిర్‌లైన్స్ విమానంలో అమెరికా నుంచి భారత్‌కు తరలిస్తున్నట్టు సమాచారం. భారత్-అమెరికాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ప్రతిపాదన మేరకు న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టు ఆమెను భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించింది. అధికారుల ప్రకారం, 1999లో మోనికా కపూర్ తన సోదరులతో కలిసి ఒక ఆభరణాల వ్యాపారం విషయంలో నకిలీ పత్రాలు సృష్టించింది. ఈ నకిలీ పత్రాల ఆధారంగా వ్యాపార అవసరాల కోసం అవసరమైన ముడిపదార్థాలను సుంకం చెల్లించకుండా దిగుమతి చేసుకునేందుకు భారత ప్రభుత్వ లైసెన్సులు పొందేందుకు ప్రయత్నించారు.
వివరాలు
దర్యాప్తులో పాల్గొనాల్సిందిగా అనేకసార్లు నోటీసులు
ఈ మోసానికి పాల్పడి వారు అమెరికాకు పారిపోయారు. మోనికా చేసిన ఈ మోసంతో భారత ప్రభుత్వానికి సుమారు రూ.5కోట్లకు పైగా నష్టం ఏర్పడిందని, అందుకే 2004లో ఆమెపై కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. దర్యాప్తులో పాల్గొనాల్సిందిగా అనేకసార్లు నోటీసులు పంపించినా మోనికా భారత్‌కు రాకపోవడంతో, 2010లో భారత ప్రభుత్వం ఆమెను అప్పగించాలంటూ అమెరికా ప్రభుత్వాన్ని కోరింది. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్‌పోల్ అధికారులు ఆమెపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆమెను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు.అయితే,భారత్‌కు పంపిస్తే తాను అక్కడ హింసలకు గురవుతానని చెబుతూ,మోనికా న్యూయార్క్‌లోని కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు ఆమె వాదనలను తిరస్కరించి,భారత్‌కు అప్పగించేందుకు అనుమతి ఇవ్వడంతో, సీబీఐ అధికారులు ఆమెను తమ కస్టడీలోకి తీసుకున్నారు.