Telangana: సింహపు తోక వానర జాతికి దీర్ఘకాల ముప్పు: సీసీఎంబీ శాస్త్రవేత్తల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ భారతదేశంలో మాత్రమే కనిపించే అరుదైన సింహపు తోక వానర (మకాక్) జాతి భవిష్యత్‌లో తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ కనుమల్లోని అన్నామలై అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఈ వానర జాతిపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు నాలుగు దశాబ్దాల పాటు నిర్వహించిన విస్తృత పరిశోధన తాజాగా పూర్తయ్యింది. డాక్టర్ ఉమాపతి నేతృత్వంలోని బృందం దాదాపు 800 వానరాలను పరిశీలించి కీలక విషయాలను గుర్తించింది.
వివరాలు
అరుదైన వానర జాతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రక్షిత అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న వానరాల సంఖ్య ఇప్పటికీ స్థిరంగా ఉందని, అయితే ప్రైవేటు ఎస్టేట్లు మరియు చిన్నచిన్న ముక్కలుగా విడిపోయిన అటవీ ప్రాంతాల్లో ఉన్న మకాక్ వానరాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని అధ్యయనం వెల్లడించింది. ప్రైవేటు అటవీ ప్రాంతాల్లో అడవులు విచ్ఛిన్నం కావడంతో ఆహారం కొరత ఏర్పడుతోందని,దీంతో వానరాలు ఆహారం కోసం రహదారులు,జనావాసాల వైపు వెళ్లాల్సి వస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాలు, విద్యుత్ షాక్‌లు వంటి ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో వానరాలు ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితులపై వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే, దీర్ఘకాలంలో ఈ అరుదైన వానర జాతి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు స్పష్టంగా హెచ్చరించారు.