
Kaleshwaram Project: కాళేశ్వరం సీఈకి సీడీఓ లేఖ.. డిజైన్లు కావాలంటే నివేదికలు ఇవ్వాల్సిందే!
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లను అందించాలంటే, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) సూచించిన ప్రకారం నిర్వహించిన పరీక్షల నివేదికలు,వాటి ఫలితాలను తప్పనిసరిగా అందజేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ) స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఆ నివేదికలను పంపితే తదుపరి చర్యలు ప్రారంభించవచ్చని తెలియజేస్తూ సీడీఓ చీఫ్ ఇంజినీర్ ఇటీవల కాళేశ్వరం (రామగుండం)చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు. ఈ పరీక్షలను మహారాష్ట్ర పుణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్), ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్‌ఎంఆర్‌ఎస్)లలో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ఇంకా ఆ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. ఈ పరీక్షల నివేదికలు అందకముందే డిజైన్లు ఇవ్వమని కోరటంతో,సీడీఓ తన అసహాయత వ్యక్తం చేస్తూ తిరిగి లేఖ రాసింది.
వివరాలు
ఈఎన్సీ లేఖతో..
మొత్తంగా మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ పునరుద్ధరణ, మిగిలిన బ్యారేజీల మరమ్మతుల విషయంలో పరిస్థితి ప్రతీ రోజు కొత్త మలుపులు తిరుగుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్.డి.ఎస్.ఎ.) నిర్వహించిన తుది అధ్యయన నివేదికలో, మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించడంతో పాటు మిగిలిన బ్యారేజీ భాగాల్లో మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని సూచించింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు కూడా కొంతమంది పరీక్షలు అవసరమని పేర్కొంది. ముందుగా డిజైనర్‌ను ఖరారు చేసి, ఆ డిజైనర్ సూచనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అయితే ఈ పరీక్షల ఖర్చు ఎవరు భరించాలన్న దానిపై నిర్మాణ సంస్థలతో సమావేశం నిర్వహించినా, సంస్థలు ఖర్చును భరించేందుకు తిరస్కరించాయి.
వివరాలు
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలోనూ ఆదేశాలు జారీ
చివరికి మంత్రుల జోక్యంతో రూ.20 కోట్లను విడుదల చేయించి సీడబ్ల్యూపీఆర్‌ఎస్, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌లతో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆ తర్వాత, జూన్ మూడవ వారంలో అప్పటి ఈఎన్సీ లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం మేడిగడ్డ బ్యారేజీలో పనులు కొనసాగుతున్నందున, ఆ పరీక్షల ఖర్చును నిర్మాణ సంస్థే భరించాల్సిందిగా స్పష్టం చేశారు. ఇదే విధంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలోనూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పరీక్షలు ఆగిపోయాయి.
వివరాలు
పది రకాల సమాచారం కావాలి..:
ఇక మరోవైపు మూడు బ్యారేజీల డిజైన్ల తయారీ బాధ్యత సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీఓ)దేనని స్పష్టం చేస్తూ, చర్యలు తీసుకోవాలని ఇటీవల ఈఎన్సీ (జనరల్) లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, సీడీఓ చీఫ్ ఇంజినీర్ తాజాగా కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ బాధ్యతలున్న చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాశారు. ఈ నెల 14న నీటిపారుదల శాఖ మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్.డి.ఎస్.ఎ. సూచనల మేరకు బ్యారేజీల స్థితిని అంచనా వేసి సమగ్రమైన డిజైన్ సిద్ధం చేయాలని నిర్ణయించారని.. అందుకు అవసరమైన సమాచారం వెంటనే అందించాలని ఆ లేఖలో సీడీఓ కోరింది. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పది రకాల వివరాలను ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది.
వివరాలు
పది రకాల సమాచారం కావాలి..:
అలాగే మేడిగడ్డ ఏడో బ్లాక్‌కు తీవ్ర నష్టం జరిగిందని, గేట్ల నిర్వహణకు ఈ ఏడో బ్లాక్‌ను ఉపయోగించకూడదని ఎన్.డి.ఎస్.ఎ. పేర్కొన్న విషయాన్ని సీడీఓ లేఖలో పొందుపరిచారు. ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించాలా? లేక అనుభవజ్ఞులైన ఏజెన్సీతో ప్రస్తుత స్థితిలో మరమ్మతులు చేయించాలా? అనే రెండు ఆప్షన్లను సూచిస్తూ, ఈ రెండు అంశాల్లో ఏది అమలు చేయాలనుకుంటున్నారో తమకు నివేదిక ఇవ్వాలని కోరారు. మొత్తం బ్యారేజీకి సంబంధించిన హైడ్రాలిక్, స్ట్రక్చరల్, హైడ్రో మెకానికల్ అంశాల వివరాలను సమగ్రంగా పంపించాలని సూచించారు.
వివరాలు
పది రకాల సమాచారం కావాలి..:
బ్యారేజీ పునరుద్ధరణను జియో టెక్నికల్, జియో ఫిజికల్, హైడ్రాలిక్ మోడలింగ్ ఆధారంగా చేయాల్సి ఉండటంతో, ఎన్.డి.ఎస్.ఎ. సూచించిన పరీక్షలను పూర్తి చేసి, నివేదికలను పంపాలని స్పష్టం చేశారు. సుందిళ్ల బ్యారేజీ విషయంలో పది రకాల సమాచారం, అన్నారం బ్యారేజీ విషయంలో తొమ్మిది రకాల సమాచారం ఇవ్వాలని కోరారు. ఇంజినీర్లు ఈ పరీక్షలు పూర్తిచేసిన తర్వాతే సీడీఓ డిజైన్ల తయారీకి ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. అయితే నిర్మాణ సంస్థలు పరీక్షల బాధ్యతలు స్వీకరించనున్నాయా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.