AP Violence: మూడు రోజులైనా ఎపిలో ఆగని హింసపై సీఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీ ఢిల్లీ రావాలని ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. బాధ్యులపై చర్యలకు సిపార్సు చేసింది. ముఖ్యంగా సీఎస్ జవహర్ రెడ్డి చేష్టలుడిగి పోయారని నిందించటం గమనార్హం. ఎన్నికలు ముగిశాక కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత పరిస్ధితులు నెలకొనడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హింస, భౌతిక దాడులను అరికట్టడంలో సీఎస్, డిజిపి పూర్తిగా వైఫల్యం చెందారని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ)ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా ప్రధాన కార్యాలయానికి నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ వచ్చి ఇద్దరు అధికారులు వివరణ ఇవ్వాలని సమాచారం. మూడు రోజుల పాటు హింసాత్మక ఘటనలను నివారించ లేకపోవడంపై ఈసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పోలీస్ బందోబస్తు విషయంలో మాజీ డీజీపీపై అభియోగాలు
జిల్లా కలెక్టర్లకు సరైన దిశా నిర్దేశం చేయడంలో సీఎస్ జవహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి. ఇక, పోలీస్ బందోబస్తు విషయంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యంతో వ్యవహరించారని మాజీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డిపై అభియోగాలు మోపారు. మరోవైపు.. కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా వరుస సమీక్షలతో కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయే, తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా.. ఇక, ఏపీలో హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాలకు సమన్లు జారీ చేసింది. హింసాత్మక ఘటనలు, వాటికి అరికట్టడంలో జరిగిన వైఫల్యాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.