ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' కాదు, 'కౌ హగ్ డే'ను జరుపుకోండి: కేంద్రం
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కాకుండా 'కౌ హగ్ డే'ను జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఆవును కౌగిలించుకోవడం వల్ల వ్యక్తిగత, సామూహిక ఆనందం పెరుగుతుందని చెప్పింది. ఆవు ప్రేమికుల విజ్ఞప్తి మేరకు కేంద్ర జంతు సంక్షేమ విభాగం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది జంతు సంక్షేమ చట్టాలను రూపొందించే సంస్థ. ఇది కేంద్రం ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తుంది. ఆవును ఆలింగనం చేసుకోవడం వల్ల దాని మీద ప్రేమ, సానూకల దృక్పథం ఏర్పడుతుందని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ పేర్కొంది.
భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆవు వెన్నెముక: యానిమల్ వెల్ఫేర్ బోర్డ్
ఆవు ద్వారా లభించే అపారమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 'కౌ హగ్ డే'ను జరుపుకోవాలని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ అసిస్టెంట్ సెక్రటరీ ప్రాచీ జైన్ విజ్ఞప్తి చేసారు. భారత సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆవు వెన్నెముక అని గుర్తు చేశారు. ఈ ఏడాది సమయం తక్కువగా ఉన్నందున ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించడం లేదన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక కార్యక్రమాలను ప్లాన్ చేస్తామని ప్రకటించారు. పాశ్చాత్య నాగరికత మోజులో పడి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని ప్రాచీ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు.