Aadhar card: ఆధార్ కార్డు డిజైన్ మార్పులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం అమల్లో ఉన్న 'ఆధార్ కార్డు' ఫార్మాట్‌లో మార్పులు చేయబోతున్నారనే ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు ఎలాంటి ప్రతిపాదన తమ ముందు లేదని స్పష్టంచేసింది. ఫోటో, క్యూఆర్ కోడ్ ఆధారంగా కొత్త విధానంలో ఆధార్ కార్డును ప్రవేశపెట్టే ఆలోచన కూడా లేదని వెల్లడించింది. ఈ విషయంపై ఆదివారం కేంద్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'ఈ ఏడాది చివరి నాటికి ఆధార్ కార్డు డిజైన్‌ను మార్చబోతున్నారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం, కొన్ని మీడియా నివేదికలు ప్రజల్లో అనవసర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
వివరాలు
అవన్నీ తప్పుడు ప్రచారాలే
ఇవన్నీ పూర్తిగా తప్పుడు వార్తలు' అని కేంద్రం పేర్కొంది. ఆధార్ కార్డులో ప్రస్తుతం ఉన్న ఆధార్ నంబర్, పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాల స్థానంలో కేవలం క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంచబోతున్నారనే వార్తలను కూడా కేంద్రం ఖండించింది. ఆధార్‌కు సంబంధించిన విషయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై నమ్మకం పెట్టుకోవద్దని, అధికారిక సమాచారాన్నే అనుసరించాలని ప్రజలను కేంద్రం కోరింది.