Flight Bomb Threats: 'ఎక్స్' ను ప్రశ్నించిన కేంద్రం.. విమానాలకు వచ్చిన బెదిరింపులపై చర్యలు
భారత విమానయాన రంగంలో ఇటీవల బాంబు బెదిరింపులు పెరుగుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ, విస్తారా వంటి ప్రధాన విమాన సంస్థలకు గత వారం నుంచి 100కు పైగా విమానాలకు ఈ బెదిరింపులు అందాయి. అంతర్జాతీయ, దేశీయ విమానాలకు ఇలాంటి నకిలీ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. అత్యధిక బెదిరింపులు ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల నుంచి వచ్చాయని అధికారులు గుర్తించారు. ఈ పరిణామాలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ చర్యలకు దిగింది. వర్చువల్ సమావేశంలో ఎయిర్‌లైన్స్, ఎక్స్, మెటా వంటి సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
నోఫ్లై లిస్టులో పెడతామని హెచ్చరిక
జాయింట్ సెక్రటరీ సంకేత్ ఎస్ భోంద్వే ఎక్స్ (ట్విట్టర్) పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ పరిస్థితిని 'ఎక్స్ ప్రేరేపిత నేరం'గా అభివర్ణించారు. పుకార్లను నిరోధించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. 120కి పైగా విమానాలు ఈ బెదిరింపులకు గురవడం వల్ల చాలా విమానాలు అత్యవసర ల్యాండింగ్ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రభుత్వం ప్రయాణికుల భద్రతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నకిలీ బెదిరింపులకు పాల్పడేవారిని 'నోఫ్లై' లిస్టులో పెడతామని స్పష్టం చేశారు.