
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ₹ 2,348 కోట్లు.. అడ్వాన్సుగా విడుదల..కేంద్ర జల శక్తి శాఖ షరతులు
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ తొలిసారి అడ్వాన్స్ నిధులు విడుదల చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,348 కోట్లను విడుదల చేస్తూ గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖాతాలో సర్దుబాటు చేయాలని సీనియర్ జాయింట్ కమిషనర్ డీసీ భట్,ఢిల్లీలోని ప్రిన్సిపల్ ఎకౌంట్స్ అధికారికి లేఖ రాశారు.
రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకోగా,దానికి అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్ర బడ్జెట్‌లోని కంటింజెన్సీ ఫండ్ నుంచి ఈ అడ్వాన్స్ నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు.
నాబార్డు రుణం ద్వారా కాకుండా,నేరుగా కేంద్ర బడ్జెట్ నుంచే ఈ నిధులు విడుదలవుతున్నాయి.
వివరాలు
షరతులు
మరో రెండు కేటగిరీల కింద కూడా గతంలో జరిగిన ప్రాజెక్టు పనులకు కేంద్ర జలశక్తి శాఖ నిధులను రీయింబర్స్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఒక కేటగిరీలో రూ.383.227 కోట్లు, మరో కేటగిరీలో రూ.76.463 కోట్లు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.2,807 కోట్లు విడుదలయ్యాయి.
పోలవరం ప్రాజెక్టుకు అడ్వాన్స్ నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది:
ఇప్పటివరకు విడుదల చేసిన రూ.2,348 కోట్లలో 75 శాతం నిధులు ఖర్చు చేసిన తరువాతే తదుపరి విడత నిధులు విడుదల చేస్తారు.
వివరాలు
షరతులు
తదుపరి విడత నిధులను విడుదల చేయాలంటే, నిర్దేశిత లక్ష్యాల ప్రకారం పోలవరం నిర్మాణ పనులు జరగాలి. ఆలస్యమైతే, స్పష్టమైన కారణాలను గుర్తించి చక్కదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలశక్తి శాఖకు తెలియజేయాలి.
పోలవరం పనులు సకాలంలో పూర్తయ్యేందుకు సమన్వయ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రకారం,రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన ప్రాజెక్టు సవరించిన నిర్మాణ షెడ్యూల్‌ను ఒప్పందంలో పొందుపరచాలి.
ప్రస్తుతం విడుదల చేస్తున్న కేంద్ర నిధులను ఒప్పందంలో పేర్కొన్న పనులకే వినియోగించాలి.
వివరాలు
షరతులు
నిర్దేశిత పనులకు మాత్రమే నిధులు వినియోగించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ధ్రువీకరణ పత్రాలు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపాలి, తర్వాత వాటిని కేంద్ర జలశక్తి శాఖకు పంపాలి.
ఈ నిధులకు సంబంధించిన ఖాతాలను కాగ్ అధికారులకు అందుబాటులో ఉంచాలి.
ప్రతి త్రైమాసికంలో ప్రాజెక్టు ఆర్థిక పురోగతిపై కేంద్రానికి అథారిటీ నివేదికలు సమర్పించాలి.