ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన
ఆన్‌లైన్‌లో మెడిసిన్ విక్రయాలపై విధాన రూపకల్పనకు కొంత సమయం ఇవ్వాలని దిల్లీ హైకోర్టును కేంద్రం కోరింది. ఈ సమస్య అనేది చాలా క్లిష్టమైనదని, ఔషధాల విక్రయ విధానంలో ఏదైనా తేడా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో విధానాన్ని రూపొందించడానికి చివరి అవకాశంగా హైకోర్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మరో నాలుగు నెలల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది. ఆ తేదీలోపు ముసాయిదా విధానాన్ని కేంద్రం సిద్ధం చేయకపోతే.. ఈ కేసును కొనసాగించడం మినహా ఈ కోర్టుకు వేరే మార్గం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.