Mallikarjun Kharge: ఎన్నికల కమిషన్ నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నాలు.. ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల్లో మార్పుల ద్వారా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత తగ్గించడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రతను నాశనం చేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని, ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై దాడికి సమానమని ఖర్గే అన్నారు. మోదీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను నిర్వీర్యం చేయడానికి ముందుగా ఎన్నికల కమిషనర్ల నియామక ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో జరిగే అక్రమాలు బయటకు రాకుండా సీసీ టీవీ ఫుటేజ్, అభ్యర్థుల రికార్డుల తనిఖీని నిషేధిస్తోంది.
నిర్ణయంపై న్యాయపరంగా సవాల్ చేస్తాం
ఇది ఎన్నికల కమిషన్ సమగ్రతకు పెద్ద దెబ్బ అని, ఈవీఎంల పారదర్శకత లోపం వంటి సమస్యలపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఈసీ స్పందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి అనుకూలంగా మార్పులు చేస్తోందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని న్యాయపరంగా సవాలు చేస్తామని ప్రకటించారు. కోర్టు తీర్పు ప్రకారం నడుచుకోవాల్సిన ఎన్నికల కమిషన్, ప్రభుత్వానికి అనుకూలంగా నిబంధనలు సవరించడం విడ్డూరమని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారవచ్చని జైరాం రమేశ్ అన్నారు. ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961లోని రూల్ 93(2)(ఏ)ను సవరించినట్లు కేంద్ర న్యాయశాఖ తెలిపింది. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ ఫుటేజ్ తనిఖీ వల్ల ఓటర్ల గోప్యతకు భంగం కలుగుతోందని, అందుకే నిషేధం విధించినట్లు స్పష్టంచేసింది.