తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంసిద్ధతను అంచనా వేసేందుకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి బృందం మంగళవారం నుంచి మూడురోజలు రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పర్యటనలో రాజకీయ పార్టీలు, వివిధ శాఖలతో ఈసీ సమావేశమవుతుంది. కేంద్ర బృందం పర్యటన తర్వాత వారం లేదా 10రోజుల తర్వాత ఎన్నిక సంఘం అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. తమ పర్యటనలో భాగంగా తొలిరోజు జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులను ఆహ్వానించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పార్టీల అభిప్రాయాలు, సూచనలను ఈసీ తీసుకుంటుంది.
చివరి రోజు డీజీపీ, సీఎస్‌తో ఎన్నికల బృందం సమావేశం
అలాగే పోలీస్, అడ్మినిస్ట్రేషన్ శాఖలతో ఈసీ అత్యున్నత స్థాయి అధికారులు సమావేశమై రానున్న ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్, రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాల నోడల్ అధికారులు ఎన్నికల సంసిద్ధత గురించి కేంద్ర బృందానికి వివరించనున్నారు. అక్టోబర్ 4న ఓటరు అవగాహన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించి జిల్లాల స్థాయిలో సన్నద్ధతపై సమీక్షిస్తారు. అక్టోబర్ 5న సిస్టమాటిక్ ఓటర్ల ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP) కార్యకలాపాలపై ప్రదర్శనను ఉంటుంది. చివరగా ఎన్నికల సన్నద్ధతపై చర్చించేందుకు ఈ బృందం తదనంతరం చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది.