రాష్ట్రాలకు మూడో విడత పన్నుల పంపిణీ; రూ.1.1 లక్షల కోట్లను విడుదల చేసిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వ పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటాను సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
మూడోవిడతకు సంబంధించి రూ.1,18,280 కోట్ల రూపాయల పన్ను పంపిణీని కేంద్రం విడుదల చేసిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ మొత్తం సాధారణ నెలవారీ 59,140 కోట్ల రూపాయలను అధిగమించింది. రాష్ట్రాలకు ఇచ్చిన ఈ పన్నుల వాటను మూలధన వ్యయం, ఆర్థికాభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులకోసం వినియోగించాలని ఆర్థిక శాఖ చెప్పింది.
ఈ విడతలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2486 కోట్లను కేంద్రం కేటాయించింది.
పన్నులు
యూపీకి అత్యధికంగా రూ.21,218కోట్లు
జనాభా, విస్తీర్ణం, ఆర్థిక సామర్థ్యం వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాలకు ఈ పన్నుల నిధులు కేటాయిస్తారు.
ప్రతి ఏటా 14 విడతల్లో ఆర్థికశాఖ ఈ నిధులను విడుదల చేస్తుంది.
ప్రస్తుతం చేసింది మూడోది కావడం గమనార్హం. యూపీకి రూ.21,218కోట్లు, బిహార్ కు రూ. 11,897 కోట్లు గరిష్టంగా నిధులు దక్కాయి.
జూన్ 2023లో యూనియన్ పన్నులు, సుంకాల నికర రాబడిని రాష్ట్రాల వారీగా పంపిణీ చేయడం ద్వారా ప్రతి రాష్ట్రం అందుకున్న మొత్తాలను వెల్లడిస్తుంది.
2023-24లో ఇప్పటివరకు కేంద్రం రూ.2.37 లక్షల కోట్లను రాష్ట్రాలకు బదిలీ చేసింది. 2022-23లో రూ.8.17 లక్షల కోట్ల బడ్జెట్ అంచనాకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.9.48 లక్షల కోట్లు బదిలీ చేసింది.