LOADING...
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ' మెట్రో రెండో దశ పనులకు అవసరమైన వ్యయంలో సగం మొత్తాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. మిగిలిన సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ప్రతిపాదన రూపొందిందన్నారు. మెట్రో విస్తరణతో పాటు మూసీ నది శుద్ధి కార్యక్రమానికి కూడా కేంద్రం సహకారం అందించనున్నట్లు తెలిపారు. అమృత్ భారత్ 2.0 పథకం కింద రూ.3,975 కోట్ల వ్యయంతో 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాలకు అనుమతి ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.

వివరాలు 

మెట్రో సెకండ్ ఫేజ్‌కు గ్రీన్ సిగ్నల్

మెట్రో రెండో దశకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక నివేదికతో పాటు సాంకేతిక వివరాలు అందిన తర్వాతే నిధుల మంజూరుపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మెట్రో రెండో దశకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించినట్లు ఖట్టర్ తెలిపారు. సుమారు 162 కిలోమీటర్ల మేర విస్తరణకు ప్రణాళికలు పంపినట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను పూర్తిగా పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని, త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక మూసీ నది ప్రక్షాళన పనులకు కూడా కేంద్రం పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

వివరాలు 

39 సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు

న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి మెట్రో విస్తరణ, మూసీ శుద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అమృత్ భారత్ 2.0 పథకం ద్వారా మూసీ నదిలో కలిసే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 39 శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటి నిర్మాణానికి రూ.3,975 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా శుద్ధి చేయని మురుగు నీరు మూసీలోకి చేరకుండా అడ్డుకట్ట వేయవచ్చని వివరించారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ 

Advertisement