Union Minister visit to Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పర్యటన
భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. రాష్ట్రంలో 1.8 లక్షల హెక్టార్ల పంట నష్టపోయిందని, 2 లక్షల మంది రైతులు ప్రభావితమయ్యారని ఆయన తెలిపారు. నిపుణుల బృందాలు నష్టాన్ని అధ్యయనం చేస్తున్నాయని, తక్షణ,దీర్ఘకాలిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని ఆదేశాల మేరకు కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శితో కలిసి రాష్ట్రాన్ని సందర్శించిన మంత్రి, ప్రభుత్వం వేగంగా స్పందించకపోతే ప్రాణ నష్టం మరింత తీవ్రంగా ఉండేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పనిచేస్తూ వరద బాధితులను రక్షించడంలో అపార కృషి చేస్తోందని కొనియాడారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, వాయుసేన, నౌకాదళం సహకారం
భారీ వర్షాలు, వరదల వల్ల విజయవాడ ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారని, నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని వివరించారు. డ్రోన్ల సహాయంతో పాలు, మంచినీళ్లు, ఆహారం అందించడం ఇక్కడే మొదటిసారి చూస్తున్నానని అన్నారు. కేంద్రం పంపిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, వాయుసేన, నౌకాదళం సహకారం అందిస్తున్నాయన్నారు. విజయవాడ కలెక్టరేట్‌లో జరిగిన ఫొటో ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. విపత్తు కారణంగా జరిగిన నష్టాన్ని చంద్రబాబు వివరించి, కేంద్ర సాయం కోరారు. బుడమేరుకు సమీపంలో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాల కారణంగా వరద ముంపు తీవ్రత పెరిగిందని, దీన్ని నివారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
బుడమేరు గండి పూడ్చేందుకు సైన్యం నుంచి ప్రత్యేక బృందాలు
అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. "వైసీపీ ప్రభుత్వ హయాంలో బుడమేరు సమీపంలో భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరిగాయి. ఇది బుడమేరు గండి పడటానికి ప్రధాన కారణం. ఈ ప్రాంతాన్ని వరద ముంపు నుంచి రక్షించేందుకు సానుకూల, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. బుడమేరు గండి పూడ్చేందుకు సైన్యం నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ డిశ్ఛార్జి సామర్థ్యాన్ని పెంచడం కోసం కేంద్రం నిపుణుల బృందం నివేదిక ఆధారంగా స్పందిస్తాం. భారీ వర్షాలు,వరదలు వల్ల అపార నష్టం జరిగింది. అనేక ప్రాంతాలు ఐదు రోజులుగా నీళ్లలోనే ఉన్నాయి. ఆ నీళ్లలో జరిగిన నష్టాన్ని గమనించాము" అని వివరించారు.
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు
"రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో 24 గంటల పాటు కృషి చేస్తోంది. ఈ సందర్భంగా, చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.బాధితుల సాయం కోసం అవసరమైన పాలు, నీళ్లు, ఆహారం అందిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. మేము ప్రత్యేక బృందాన్ని నియమించి, బాధితులకు అవసరమైన వనరులు అందుతున్నాయా అన్నది నిర్ధారించుకుంటున్నాము. సీఎం స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, పారిశుద్ధ్య పనులు, ఇళ్లలో పేరుకున్న బురదను తొలగించే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. చనిపోయిన పశువుల కళేబరాలను తొలగించడం, నష్టాన్ని అంచనా వేయడం కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి" అని కేంద్ర మంత్రి వివరించారు.
ఆక్వా రంగానికి నష్టం
"గత వైసీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది" అని చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం, ఎన్డీయే ప్రభుత్వం ప్రీమియం చెల్లించడంతో, రైతులకు బీమా సాయం అందునట్లుగా చెప్పారు. "భారీ వర్షాలు, వరదల కారణంగా 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. దీని వల్ల 2.05 లక్షల మంది రైతులు రూ.1,056 కోట్లు నష్టపోయారు. 12 జిల్లాల్లో 19,453 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినడంతో 30,154 మంది రైతులు నష్టపోయారు. భారీ వర్షాలు 3,756 కిమీ మేర రోడ్లకు నష్టం కలిగించాయి. ఆక్వా రంగానికి కూడా నష్టం ఏర్పడింది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు.