Telangana: దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ.2,282 కోట్లు.. కేంద్ర బృందానికి నివేదిక
ఇటీవలి భారీ వర్షాలు తెలంగాణలో రోడ్లు, వంతెనలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ వర్షాల కారణంగా 2,410 కిలోమీటర్ల పొడవున్న ఆర్‌అండ్‌బీ రోడ్లు, 150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, 193 హైలెవల్ వంతెనలు, 77 కల్వర్టులు, కాజ్‌వేలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొత్తం 600 రోడ్లు దెబ్బతిన్నాయి.వర్షపు నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చాలా చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి,వంతెనలు, కల్వర్టులు కొట్టుకుపోయాయి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద తగ్గిన తర్వాత, అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.
కేంద్ర బృందానికి నివేదిక
జిల్లా వారీగా దెబ్బతిన్న రోడ్లను గుర్తించారు. వీటి పునరుద్ధరణ కోసం రూ.2,282 కోట్లు, తాత్కాలిక మరమ్మతులకు రూ.86.17 కోట్లు అవసరమని అంచనాలు వేయడం జరిగింది. వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర అధికారుల బృందం బుధవారం నుండి రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించనుంది. ఈ పర్యటన తర్వాత, కేంద్ర బృందానికి నివేదిక అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.