Telangana: తెలంగాణకు రూ.3,825 కోట్ల కేటాయింపు.. వీబీ జీరామ్‌జీ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో జులై 1 నుంచి అమల్లోకి రానున్న వీబీ జీరామ్‌జీ(VB GRMG) పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ.3,825.31 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన తొమ్మిది నెలల కాలానికి వర్తించేలా కొత్త నిబంధనల ప్రకారం ఈ నిధులను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. వీబీ జీరామ్‌జీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తన 60 శాతం వాటా కింద ఈ మొత్తాన్ని విడుదల చేయనుంది.
వివరాలు
జులై 1 నుంచి అమల్లోకి..
రాష్ట్రంలో వచ్చే తొమ్మిది నెలల కాలానికి జీరాంజీ పథకం అమలుకు మొత్తం రూ.6,375.52 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా, ఇందులో కేంద్రం అందించే రూ.3,825.31 కోట్లకు అదనంగా మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.2,550.21 కోట్లను తన వాటాగా వెచ్చించి పథకం పనులను చేపట్టాలని కేంద్రం సూచించింది. జులై 1 నుంచి అమల్లోకి రానున్న జీరాంజీ పథకం అమలులో కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంతో గ్రామీణాభివృద్ధి పనులు కొనసాగనున్నాయి.