maternity leave for surrogacy: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సరోగసీ కోసం 6 నెలల ప్రసూతి సెలవులు
సరోగసీ ద్వారా తల్లులయ్యే కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. మహిళలకు ప్రసూతి సెలవులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. సరోగసీ ద్వారా తల్లులుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇచ్చే నిబంధన ఇంత వరకు లేదు. 50 ఏళ్ల నాటి నిబంధనను కేంద్రం ఈ సవరణతో మార్చింది. తల్లితో పాటు తండ్రికి కూడా సెలవు ప్రయోజనం లభిస్తుంది.
నియమం ఏమి చెబుతుంది?
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవులు) రూల్స్, 1972 ప్రకారం,సరోగసీ ద్వారా పిల్లలు పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులు 180 రోజుల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. అలాగే సరోగసీ ద్వారా జన్మించిన పిల్లల విషయంలో,ఇద్దరు కంటే తక్కువ జీవించి ఉన్న పిల్లలను కలిగి ఉన్నపురుష ప్రభుత్వ ఉద్యోగి కూడా బిడ్డ ప్రసవించిన తేదీ నుండి 6 నెలల వ్యవధిలో 15 రోజుల పితృత్వ సెలవు తీసుకోవచ్చు. దీనితో పాటు మహిళా ఉద్యోగులు కూడా కొత్త నిబంధన ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ తీసుకోవచ్చు.
నిబంధనలను జూన్ 18న నోటిఫై చేసింది
సవరించిన నిబంధనలను జూన్ 18న సిబ్బంది మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. సరోగసీని 2002లో గుర్తించామని, అయితే దానికి నిర్దిష్టమైన నియమాలు లేవన్న విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఒక మహిళా ప్రభుత్వోద్యోగి, ఒక పురుష ప్రభుత్వోద్యోగి విద్య, అనారోగ్యం వంటి అవసరాల కోసం జీవించి ఉన్న వారి ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం మొత్తం సేవా వ్యవధిలో 730 రోజుల శిశు సంరక్షణ సెలవును పొందవచ్చు.