అయ్యప్ప భక్తులకు కేంద్రం శుభవార్త.. శబరిమల స్పెషల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు ఆమోదం
ఏటా లక్షలాది మంది భక్తులు అయ్యప్ప మాలను భక్తిశ్రద్ధలతో ధరిస్తారు. నియమ, నిష్ఠలతో పూజలు చేస్తారు. స్వామి దర్శనం కోసం ఎంత దూరం నుంచైనా శబరిమలకు తరలివెళ్తుంటారు. రోడ్డు, రైలు సహా వాయు మార్గాల్లోనూ శబరికి వెళ్తారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు సహా సుదూర ప్రయాణానికి ఇబ్బంది పడేవారు, సమయం తక్కువ ఉన్నవారు విమానాలనే ఆశ్రయిస్తారు. అయితే శబరిమలలో విమానాశ్రయం కట్టాలనేది అయ్యప్ప భక్తుల చిరకాల స్వప్నం. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రతీ సంవత్సరం భారీగా మకరజ్యోతి దర్శనం కోసం శబరి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రోడ్డు, రైళ్ల మార్గం కిటకిటలాడుతుంటుంది. తాజాగా ప్రత్యేక వాయు మార్గంతో భక్తులకు మరింత అనుకూలంగా ఉండనుంది.
శబరిమల భక్తుల కోసం స్పెషల్ ఏయిర్ పోర్ట్ కు కేంద్రం లైన్ క్లియర్
అయ్యప్ప సన్నిధికి విమానంలో వెళ్లాలంటే కొచ్చి లేదా తిరువనంతపురంలో దిగాల్సిందే. అయితే కొచ్చిలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శబరిమలకు దాదాపు 160 కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తారు. మరోవైపు తిరువనంతపురం నుంచి సుమారు 170 కిలోమీటర్లు ప్రయాణం ఉంటుంది. తాజాగా శబరిమలకు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును శాంక్షన్ చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రూ. 3,411 కోట్ల ఖర్చుతో ఎరుమేలిలో ఈ ఏయిర్ పోర్టు నిర్మాణం చేయనున్నారు. 2,570 ఎకరాల్లో భారీ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. విమానాశ్రయం నుంచి పంబకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది.దీంతో శబరిమలకు వెళ్లే భక్తులకు ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది.