LOADING...
Musi Riverfront: మూసీ రివర్‌ఫ్రంట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి
మూసీ రివర్‌ఫ్రంట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్

Musi Riverfront: మూసీ రివర్‌ఫ్రంట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని బాపూఘాట్‌ను 'గాంధీ సరోవర్' ప్రాజెక్టుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు పరిధిలోని రక్షణ శాఖ భూములను వినియోగించుకునేందుకు అవసరమైన పని అనుమతులను మంజూరు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఇచ్చిన అనుమతుల ప్రకారం.. ఆర్టిలరీ సెంటర్ గోల్కొండ పరిధిలోని 83.81 ఎకరాల రక్షణ శాఖ భూమిని గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం వినియోగించుకోవచ్చు.

వివరాలు 

రేవంత్ రెడ్డి హర్షం

ఈ భూమి విలువ సుమారు రూ.533.42 కోట్లుగా అంచనా. చట్టపరమైన, రక్షణ శాఖ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సుదీర్ఘంగా జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ భూ బదలాయింపు ప్రక్రియకు కేంద్ర రక్షణ శాఖ తుది ఆమోదం తెలిపింది. దీంతో బాపూఘాట్ పరిసర ప్రాంతాల్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ స్థాయి స్మారక నిర్మాణాలు, పర్యాటక అభివృద్ధి పనులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేపట్టేందుకు మార్గం సుగమమైంది. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు లభించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

వివరాలు 

తాజా క్లియరెన్స్‌తో మూసీ రివర్‌ఫ్రంట్ ఫేజ్-1 పనులు మరింత వేగం

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవనం,రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం నిర్దేశించుకున్న దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో ఇది చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని కేవలం కాంక్రీట్ నిర్మాణాలకు పరిమితం చేయకుండా.. పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక అభివృద్ధి, ప్రజల వినియోగానికి అనువైన అద్భుతమైన ప్రజా ఆస్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన తాజా క్లియరెన్స్‌తో మూసీ రివర్‌ఫ్రంట్ ఫేజ్-1 పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Advertisement